బెంగాల్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత

12 Mar, 2020 10:10 IST|Sakshi
సంతు ముఖోపాధ్యాయ్‌ (ఫైల్‌ ఫోటో)

కోల్‌కతా: సీనియర్‌ బెంగాల్‌ నటుడు సంతు ముఖోపాధ్యాయ్‌(60) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం రాత్రి దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1951లో కోల్‌కతాలో జన్మించిన సంతు యుక్త వయస్సులోనే సినీ రంగంలో ప్రవేశించారు. సంసార్‌ సిమాంటే, రాజా, భాలోబాసా భాలోబాసా వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. గత కొంతకాలంగా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బీపీ విపరీతంగా పెరగటం, హైపర్‌ టెన్షన్‌కు గురికావడంతో ఫిబ్రవరి 4న సంతు ముఖోపాధ్యాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం గత వారం ఇంటికి తీసుకురాగా.. బుధవారం మరణించారు. ఆయనకు ముఖోపాధ్యాయ్‌కు ఇద్దరు కూతుళ్లు స్వస్థిక ముఖర్జీ, అజోపా ముఖర్జీ ఉన్నారు. 

వీరిలో స్వస్థిక ముఖర్జీ నటిగా రాణిస్తుండగా... అజోపా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కాగా సంతు ముఖోపాధ్యాయ్‌ మరణం పట్ల బెంగాల్‌ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌ మంత్రి అరూప్‌ బిశ్వాస్‌ సంతు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక దర్శకుడు కౌశిక్‌ గంగూలీ మాట్లాడుతూ.. సంతు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు