తిరిగిరాని లోకాలకు విద్యాసిన్హా

15 Aug, 2019 15:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి విద్యాసిన్హా(71) గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. హృదయ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె కొంతకాలంగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. గతంలో అనారోగ్య కారణాలతో బుల్లితెరలో ప్రసారమయ్యే ‘కుల్ఫీ కుమార్‌ బజేవాలా షో’ నుంచి విద్యాసిన్హా తప్పుకున్నారు. అయితే ఆరోగ్యం కుదుటపడిందని భావించి కొన్ని వారాల క్రితం షోలో తిరిగి ఎంట్రీ ఇవ్వగా మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కాగా విద్యాసిన్హా మరణానికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

విద్యాసిన్హా 27 ఏళ్ల వయస్సులో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనతికాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చోటీసీ బాత్‌, రజనీ గంధ, పతి పత్ని ఔర్‌వో అనే చిత్రాలు ఆమె కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షమై ప్రేక్షకులను మెప్పించారు. కుల్ఫీ కుమార్‌ బజేవాలా, కుబూల్‌ హై, కావ్యాంజలి, భాబీ వంటి పలు షోలలో విద్యాసిన్హా నటించింది. బాలీవుడ్‌ ఒక మంచి నటిని కోల్పోయిందని ప్రముఖ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు