దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

21 Aug, 2019 02:10 IST|Sakshi
ఎర్నేని రంగారావు

ప్రముఖ దర్శకులు ఎర్నేని రంగారావు గత ఆదివారం (ఈ నెల 18) తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గురజకి చెందిన రంగారావు 20 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్‌ ఆరంభంలో మద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్‌లో జయరామ రెడ్డితో కలిసి పెయింటర్‌గా, మౌల్డర్‌గా చేశారు. ‘పాతాళ భైరవి’ సినిమాలోని విగ్రహం మౌల్డింగ్‌కి పని చేసినవాళ్లలో రంగారావు ఒకరు. రెండేళ్లు వాహినీ స్టూడియోస్‌లో చేసి, డైరెక్షన్‌ మీద ఆసక్తితో ప్రముఖ దర్శకులు హెచ్‌.ఎమ్‌. రెడ్డి, కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు రంగారావు. రెండేళ్ల తర్వాత జయరామ రెడ్డితో కలిసి బాపు ఫిలింస్‌ ఆరంభించి, 1960లో ‘టౌన్‌ బస్‌’ అనే సినిమాని తెలుగులోకి అనువదించి, విడుదల చేశారు.

1963లో ఎన్టీఆర్, షావుకారు జానకి, గుమ్మడి కలయికలో స్వీయదర్శకత్వంలో ‘సవతి కొడుకు’ అనే సినిమా రూపొందించారు. అలాగే నూతన తారలతో ‘మాయావి’, ‘అర్చన’ అనే చిత్రాలను స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. వ్యక్తిగత విషయానికొస్తే 1954లో తన మేనకోడలు ఉప్పలపాటి రఘుమా దేవిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర రావు ఉన్నారు. యూఎస్‌లో డాక్టర్‌గా సెటిలైన తనయుడి దగ్గరకు 1990లో వెళ్లిపోయారు రంగారావు. అక్కడ దాదాపు 300 పెయింటింగ్స్‌ వేసి, న్యూయార్క్, న్యూజెర్సీలో ప్రదర్శనకు ఉంచారు. యూఎస్‌ పౌరసత్వం పొందిన రంగారావు 2002లో ఇండియా వచ్చేశారు. 2014లో రఘుమా దేవి కన్నుమూశారు. రంగారావు అంతిమ క్రియలు నేడు గురజలో జరుగుతాయి.

మరిన్ని వార్తలు