ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది...

5 Oct, 2015 09:27 IST|Sakshi
ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది...

మూగ అమ్మాయి, దంపతుల తగాదాలు తీర్చే ముసలి దంపతులు, ఒకప్పుడు బాగా బతికి ఆ తర్వాత చితికిపోయిన గాత్ర విద్వాంసుడు, తాడూ బొంగరం లేకపోయినా పరాయి మతం అమ్మాయితో ప్రేమలో పడే అల్లరి చిల్లరి కుర్రాడు, జీవితంలో అన్ని విధాలా దివాలా తీసిన డాన్సర్... ఇలాంటి పాత్రలు తెరమీద కనపడాలంటే ఆ నిర్మాతకు ఉండాల్సింది కరెన్సీని ఎంచే వేళ్లు కాదు... కథను అక్కున జేర్చుకునే గుండె . ఏడిదకు అది నిండుగా ఉంది.

‘సాగర సంగమం’లో ఒక సన్నివేశం ఉంటుంది. ‘పంచభూతములు ముఖపంచకమై..’ అనే చరణానికి ఎస్.పి.శైలజ చేసిన అభినయాన్ని తప్పు పడుతూ రిపోర్టర్ పాత్రధారి అయిన కమల్ పిచ్చి చేష్టలు కుప్పిగంతులు అని రిపోర్ట్ రాస్తాడు. అది చూసి శైలజ ప్రియుడు రెచ్చిపోయి నీకేం తెలుసని... అపాలజీ చెప్పరా బాస్టర్డ్ అంటాడు. అప్పుడు జరిగే సన్నివేశం తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైనది. ‘సాగర సంగమం’ ఎప్పుడొచ్చినా అందరూ పదే పదే చూసేది. ఆ సన్నివేశంలో కమల్ పంచభూతములు అనే చరణానికి భరతనాట్యం, కథక్, కథాకళి... ఈ నృత్య సంప్రదాయాలన్నింటిలోనూ అభినయం చేసి చూపిస్తాడు.

 పొగరు కాదు అది. పాండిత్యం. మంచి కథను ఎంపిక చేసుకోవడంలో  నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు కూడా అలాంటి పాండిత్యమే ఉంది. లేకుంటే మూగపిల్ల ఉంటుంది.... ఆమెకు డాన్స్ చేయాలని ఉంటుంది అనంటే బాగుందే అని ‘సిరిసిరిమువ్వ’ తీయడానికి అంగీకరించేవారా? ఒక గొప్ప గాత్ర విద్వాంసుడు. కాలం మారి సంగీతం కలుషితమయ్యి సంప్రదాయానికి విలువ తగ్గిపోయి దీనావస్థలో బతుకుతుంటాడు అనంటే ఇది చెప్పాల్సిన కథే అని రంగంలోకి దిగి ఉండేవారా?...
మంచి దర్శకులు ఎప్పుడూ తయారవుతూనే ఉంటారు.

గొప్ప కథలు సిద్ధమవుతూనే ఉంటాయి.
కాని కళ ఉన్నవాడి దగ్గర కాసు ఉండదు.కాసు ఉన్నవాడికి ఆ కళను గ్రహించగలిగే శక్తి ఉండి దానిని జనం దగ్గరకు తీసుకెళ్లాలనే హృదయం ఉండాలి. మంచి పని చేస్తే విజయం ఎలాగూ వస్తుంది. దాని వెనుక కాసు రాకుండా ఉంటుందా? ఏడిద నాగేశ్వరరావు తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది.

‘శంకరాభరణం గొప్పదా... సాగర సంగమం గొప్పదా’ అనంటే శంకరాభరణమే గొప్పది అనంటాను. ఎందుకంటే కమల్ లేకపోతే ‘సాగర సంగమం’ లేదు. కమల్‌ని దృష్టిలో పెట్టుకోకపోతే ఆ సినిమా కథ లేదు. కాని ‘శంకరాభరణం’ అలా కాదు. అది దానికదే ఒక ప్రాణమున్న కథ. దానికి నటులతో పని లేదు’ అన్నారు కృష్ణవంశీ ఒక సందర్భంలో. నిజం. దానికదే ఒక కథ అయిన దానిని ఏడిద నాగేశ్వరరావు గౌరవించారు. దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకు సపోర్టివ్‌గా నిలిచారు. నాటకాలు వేసుకునే జె.వి.సోమయాజులు, వాంప్ పాత్రల ముద్రపడిన మంజుభార్గవి... వీళ్లతో సినిమా తీయడమా? నిర్మాతకు దర్శకుడి మీద నమ్మకం ఉంది. ప్రేక్షకుల మీద ఇంకా ఎక్కువ నమ్మకముంది.

యాక్షన్ సినిమాలు, డబుల్ మీనింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలు.... సీజన్ ఏదైతే దాని చుట్టూ పరిశ్రమ తిరగడం చాలా సార్లు జరిగింది. కాని పూర్ణోదయా సంస్థ, దాని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పంథాలో మాత్రం మార్పు లేదు. మంచి కథ, మంచి దర్శకుడు, మంచి సంగీతం... ఈ మూడింటినే నమ్ముకున్నారు.

ఏడిద నాగేశ్వరరావుకు తాను తీసిన సినిమాల్లో కీలకమైన సూచనలు చేసే శక్తి ఉంది. ‘సాగర సంగమం’లో చివరన హీరో చనిపోవాలా వద్దా అనే తర్జన భర్జన జరుగుతున్న సందర్భంలో చనిపోతేనే బాగుంటుందన్న సూచన ఆయనదే. అది ప్రేక్షకులకు ఎటువంటి ఫీల్ మిగిల్చిదో మనకు తెలుసు. ‘సీతాకోక చిలుక’ క్లయిమాక్స్‌ను దుఃఖాంతం చేయాలని దర్శకుడు భారతీరాజా పట్టుబట్టారు. కాని సుఖాంతమే కరెక్టని ఏడిద పంతం. భారతీరాజా రెండు విధాలుగా చిత్రీకరించి తెలుగులో నిర్మాత కోరిక మేరకు సుఖాంతం, తమిళంలో దుఃఖాంతంతో విడుదల చేద్దామనుకుని చివరకు ఏడిద నిర్ణయమే కరెక్టని రెండు భాషల్లోనూ సుఖాంతంగా విడుదల చేశారు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఒక చెప్పులు కుట్టేవాడి పాత్ర చిరంజీవికి బాగుంటుంది.. ఆయన చేస్తే జనం చూస్తారు అనే నమ్మకం ఒమ్ముకాకపోవడం కూడా ఏడిద అభిరుచికి ఒక నిదర్శనం.

ఏడిద నాగేశ్వరరావు చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘సితార’ వంటి కొత్త తరహా కథ చెప్పినా, కొత్త తరహా సంవిధానంతో తీసినా వంశీ వంటి కొత్త దర్శకుడికి మద్దతుగా నిలిచి ఆయనను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఆయన.సినిమా ఇండస్ట్రీలో చాలా థియరీలు ఉంటాయి. ఫలానా కథ మాస్‌కు ఎక్కదని ఫలానా కథ యూత్‌కు పట్టదని.... ఏడిద నాగేశ్వరరావు ఈ లెక్కలేవి వేసుకున్న పాపాన పోలేదు.


‘సిరిసిరి మువ్వ’తో మా అనుబంధం మొదలైంది. ఆ తర్వాత  పూర్ణోదయాలో ‘శంకరాభరణం’ చేశాను. ఆ చిత్రంతో దర్శకుడిగా నాకు ఇంకో కొత్త తొడుగు వచ్చినట్లయింది. ఆ తర్వాత మేం చేసిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’ చిత్రాలు కూడా ఆణిముత్యాలే. ఏడిద నాగేశ్వరరావుగారి స్థానం భర్తీ కానిది.ఙ- కె.విశ్వనాథ్, దర్శకుడు

విలువలున్న చిత్రాలు తీశారు. భాగస్వామ్యంతో ఆయన తీసిన ‘సిరి సిరి మువ్వ’లో హీరోగా చేశాను. పూర్ణోదయా సంస్థపై నిర్మించిన చిత్రాల్లో ‘శంకరా భరణం’, ‘తాయారమ్మ బంగారయ్య’లో గెస్ట్ రోల్స్ చేశాను. ఏడిద నాగేశ్వరరావుగారితో నాది 30ఏళ్ల అనుబంధం. ఆయన మరణం తీరని లోటు. - చంద్రమోహన్, నటుడు

ఏడిద నాగేశ్వరరావుగారు నిర్మించిన చిత్రాల్లో నేను పాడని చిత్రం లేదు. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ చిత్రాలకు జాతీయ అవార్డులు పొందాను. ఆరోగ్యవంతమైన సినిమాలు, సకుటుంబంగా చూడబడే సినిమాలు కూడా వ్యాపారాత్మకమైన సినిమాలని నిరూపించిన సంస్థ పూర్ణోదయా. చిత్రసీమ ఓ మంచి నిర్మాతను కోల్పోయింది.        - బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు

నాలో ఆయన్ను చూసుకున్నారు
‘‘నాన్నగారు గొప్ప నిర్మాత మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఏడిద శ్రీరామ్. తండ్రి గురించి మరికొన్ని విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నాన్నగారికి నటన అంటే చాలా ఇష్టం. మొదట్లో కొన్ని పాత్రలు చేశారు. కానీ, నిర్మాత అయిన తర్వాత ఆయనంతట ఆయన నటుడిగా రిటైర్ అయ్యారు. నేను నటుడు కావాలన్నది ఆయన కోరిక. నాలో తనను చూసుకోవాలనుకున్నారు. అందుకే నేను ఆర్టిస్ట్ అయినప్పుడు చాలా ఆనందపడ్డారు. ఇటీవల ‘శ్రీమంతుడు’లో నేను చేసిన పాత్రను చాలా ఇష్టపడారు. నాన్నగారు ఆరోగ్యంగానే ఉండేవారు. గత నెల 19న వాంతులు అయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేర్చాం. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. నాన్నగారు పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. అది మాకు సంతృప్తిగా ఉంటుంది. కానీ, నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటు’’.  - ఏడిద శ్రీరామ్, నటుడు

పూర్ణోదయ సంస్థలో ఆరు చిత్రాల్లో నటించాను. ఏడిద నాగేశ్వరరావుగారికి నేనంటే ఓ గురి. అందుకని, నాకు నప్పే పాత్ర ఉంటే తప్పకుండా తీసుకునే వారు. కమర్షియల్ చిత్రాలు తీస్తేనే సక్సెస్ కాగలం అనే పరిస్థితి ఉన్న తరుణంలో, ఆ పంథాలో కాకుండా తాను నమ్మిన కథతో సినిమాలు తీసి, కమర్షియల్ విజయం సాధించారు. మంచి నిర్మాతగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. -శరత్‌బాబు, నటుడు

పూర్ణోదయా చిత్రావళి

ప్రతి ఒక్కడూ మనిషే.
ఒక మంచి కథ మన హృదయాన్ని తాకితే హృదయాన్ని తాకేలా తీయగలిగితే అది అందరికీ చేరుతుంది అని నమ్మాడాయన.
ఆయనగాని, ఆయన సినిమాలుగాని ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ ఒక రుజువులా నిలిచిపోతాయి.- సాక్షి ఫ్యామిలీ