‘గొల్లపూడి’ ఇకలేరు

13 Dec, 2019 02:03 IST|Sakshi

అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస

ఆదివారం అక్కడే అంత్యక్రియలు

రచయిత, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సుప్రసిద్ధులు

సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

అనారోగ్య కారణాలతో చెన్నైలో తుదిశ్వాస

సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి అమరావతి, హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉ.11.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శివగామి సుందరి, కుమారులు సుబ్బారావు, రామకృష్ణ ఉన్నారు. ఒక కుమారుడు శ్రీనివాస్‌ గతంలోనే ప్రమాదానికి గురై మరణించారు. సాహిత్యాభిలాషిగా, రచయితగా అన్ని రంగాలకు చెందిన అంశాలపై విశ్లేషకునిగా, విప్లవాత్మకమైన విమర్శకునిగా పేరొందిన గొల్లపూడి.. తెలుగు భాషాభిమానులకు, సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేని వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నైలో జరిగే తెలుగు సంఘాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపూడి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గత నెల 5న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. అయితే, మళ్లీ అస్వస్థతకు గురై ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య కారణాలవల్ల శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్స్‌) విజయ నగరంలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలోనే పూర్తిచేశారు. ఈ కారణంతోనే ఆయన చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటూనే నెలలో కొన్నిరోజులు విశాఖలో గడుపుతూ సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేవారు. 

15న చెన్నైలో అంత్యక్రియలు
గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఈనెల 15న చెన్నైలో జరపనున్నట్లు ఆయన చిన్న కుమారుడు రామకృష్ణ తెలిపారు. తండ్రి భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి స్వగృహానికి తీసుకొచ్చి ఆదివారం ఉదయం వరకు బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. జర్మనీలో ఉంటున్న కుమారుడు సుబ్బారావు పెద్ద కుమార్తె, అమెరికాలో చదువుకుంటున్న మూడో కుమార్తె.. మారుతీరావు రెండో కుమారుడు రామకృష్ణ కుమారుడు శ్రీనివాస్‌ జర్మనీ నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలను ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయించారు.

ప్రముఖుల దిగ్బ్రాంతి..
గొల్లపూడి మారుతీరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయ భావాలు కలిగిన మానవతావాది, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇక లేరనే వార్త తీవ్రమైన బాధ కలిగించిందని వెంకయ్య అన్నారు.  తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్‌ కొనియాడారు.   బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి.. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని వైఎస్‌ జగన్‌ అన్నారు. గొల్లపూడి మరణంపై సంతాపం వ్యక్తం చేసినవారిలో  హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు