థియేటర్‌ అనుభూతిని ఏదీ ఇవ్వలేదు

23 Jan, 2020 00:38 IST|Sakshi
వీఐ ఆనంద్‌

‘‘స్క్రిప్ట్‌లోని హీరో క్యారెక్టర్‌ని బట్టి పూర్తి కథ అల్లుకుని సినిమాలు తీయాలంటే నాకు భయం. అందుకే నా సినిమాల్లో కొత్తదనం, కంటెంట్‌ ఉండాలని కోరుకుంటాను. కాన్సెప్ట్‌ మూవీస్‌లో కమర్షియల్‌ అంశాలుండకూడదు. కమర్షియల్‌ సినిమాలో కాన్సెప్ట్‌ పెద్దగా ఉండకూడదనడం సరైంది కాదు. కాన్సెప్ట్‌ సినిమాలను కమర్షియల్‌ పంథాలో వినోదాత్మకంగా ప్రేక్షకులకు చూపించాలనే ‘డిస్కోరాజా’ చిత్రం తీశాను’’ అన్నారు వీఐ ఆనంద్‌. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొంది న చిత్రం ‘డిస్కోరాజా’. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా వీఐ ఆనంద్‌ చెప్పిన విశేషాలు.

► ‘డిస్కోరాజా’ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా. లైవ్‌ పోర్షన్, రెట్రో పోర్షన్స్, సెన్స్‌ ఫిక్షన్‌ ఇలా సినిమాలో మూడు రకాల సీక్వెన్స్‌ ఉన్నాయి. పదేళ్ల క్రితమే ఈ సినిమా మెయిన్‌ పాయింట్‌ నా దగ్గర ఉంది. అయితే ప్రేక్షకులు కన్విన్స్‌ అయ్యేలా ఎలా తీయాలని పరిశోధన చేస్తున్నాను. ఓ సందర్భంలో బయో రీసెర్చ్‌కు చెందిన ఆర్టికల్‌ చదివాను. ఆర్టికల్‌లో ప్రస్తావించిన ప్రయోగం సక్సెస్‌ అయితే ఎలా ఉంటుంది? అని ఊహించి ‘డిస్కోరాజా’ కథ రాశాను. అది ఎలాంటి ప్రయోగం అనే విషయం గురించి ఇప్పుడు చెప్పలేను. నా కెరీర్‌లోనే ‘డిస్కోరాజా’ పెద్ద బడ్జెట్‌ మూవీ. అలాగే కెరీర్‌లో నేను ముందుకు వెళ్లడానికి కూడా ఈ సినిమా విజయం నాకు ముఖ్యం. ఇందులో రవితేజగారు సంగీతాన్ని అమితంగా ఇష్టపడే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు.

► ‘ఒక్క క్షణం’ చిత్రానికి మంచి రివ్యూస్‌ వచ్చాయి. నాకు పేరు వచ్చింది. కానీ సినిమా ఎందుకు ఆడలేదో, కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో ఎందుకు రాలేదో తెలియదు. సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో విశ్లేషించుకున్నాం.

► అల్లు అర్జున్‌గారితో ఓ సినిమా గురించి చర్చలు జరిగిన మాట నిజమే. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు కమిట్‌మెంట్‌ ఉంది. అది ఎవరితో అనేది నిర్మాతలు వెల్లడిస్తారు.  వెబ్‌ సిరీస్‌లు ఎంత హిట్‌ సాధించినా థియేటర్‌లో సినిమా చూడటం వేరు. ఆ అనుభూతిని ఏదీ మార్చలేదని నా అభిప్రాయం.

► నేను ఆర్కిటెక్ట్‌ని. చెన్నైలో బీఆర్‌ కాలేజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా ఐదో ఏడాదిలో డిజైన్స్‌ పరంగా థీసిస్‌ చేయాల్సి ఉంటుంది. కొందరు హస్పిటల్స్‌ను, కొందరు రైల్వేస్టేషన్స్‌ను ఎంచుకున్నారు. నేను ఫిల్మ్‌ సిటీని ఎంచు కున్నాను. అప్పటినుంచే నాకు సినిమాలంటే ఇష్టం. ముందు∙అసిస్టెంట్‌గా వర్క్‌ చేసి, తర్వాత దర్శకుడిని అయ్యాను.

మరిన్ని వార్తలు