‘షికారా’ విమర్శలపై స్పందించిన విధు చోప్రా

13 Feb, 2020 12:50 IST|Sakshi

తన సినిమాపై ఆరోపణలు చేసిన వారు గాడిదలతో సమానమని బాలీవుడ్‌ దర్శకుడు విధు వినోద్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘షికారా’ ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989-90 కాలంలో కశ్మీర్‌ నుంచి వలస వెళ్లిన కశ్మీర్‌ పండితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరైన వసూళ్లు రాబట్టకపోవడంతో కొంతమంది సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తన్నారు. కశ్మీరీల జీవితాలను కమర్షియల్‌గా చూపించిన విధుకు సరైన శాస్తి జరింగిందంటూ విమర్శించారు. అలాగే ట్విటర్‌లో #BoycottShikara అంటూ హ్యష్‌ట్యాగ్‌తో సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ‘ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’ అని ఓ కశ్మీర్‌ మహిళ విధు చోప్రాపై విరుచుకుపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’) 

తాజాగా ఈ విమర్శలపై స్పందించిన విధు చోప్రా.. గాడిదలుగా మాట్లాడకండి అంటూ విమర్శకులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన 3 ఇడియట్స్‌ మొదటి రోజు రూ. 33 కోట్లు రాబట్టింది. అలాగే షికారా మొదటి రోజు రూ. 30 లక్షలు సాధించింది. అయినా ఈ సినిమా తీయడానికి మేము 11 సంవత్సరాల సమయం కేటాయించాం.  నేను మొదటి రోజు రూ. 33 కోట్లు సాధించిన సినిమా చేశాను. కానీ నా తల్లి జ్ఞాపకార్థం కోసం చేసిన సినిమా మొదటి రోజు రూ. 30 లక్షలు వసూలు చేసింది. అయినా కశ్మీర్‌ ప్రజలు బాధను నేను వాణిజ్యపరంగా చేశానని ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధంగా భావించే వారు గాడిదలు అని నేను అనుకుంటున్నాను. నేను కేవలం వాస్తవాలనే మాత్రమే చిత్రీకరించాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. గాడిదలు కాకండి. ముందుగా సినిమా చూసి ఆ తరువాత ఓ అభిప్రాయానికి రండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘షికారా’ను నిలిపి వేయాలంటూ పిటిషన్‌)

చదవండి : సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్‌

మరిన్ని వార్తలు