ఆ చేదు సంఘటన ఇంకా మరిచిపోలేదు: విద్యాబాలన్‌

26 Aug, 2019 19:24 IST|Sakshi

వైవిధ్యభరిత పాత్రలకు విద్యాబాలన్‌ పెట్టింది పేరు. ఆమె బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో పలు ప్రేక్షకాదారణ చిత్రాలలో నటించింది. ఇటీవలే బాలకృష్ణ  ‘కథానాయకుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.  అవకాశాల పరంగా తమిళ చిత్ర పరిశ్రమలో రెండు ఇబ్బందికర సంఘటనలు జరిగాయని విద్యాబాలన్‌ వాపోయింది. దీనికి సంబంధించిన నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఓ తమిళ చిత్రంలో  నటించడానికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తిరస్కరించడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని విద్యాబాలన్‌ తెలిపింది. అయితే తన బాధను చూసి తట్టుకోలేక.. తన కుటుంబ సభ్యులు ఆ నిర్మాత ఇంటికి తీసుకుని వెళ్లగా ఆయన ఆశ్చర్యకర రీతిలో తమను అవమానపరిచారని తెలిపింది. తన క్లిప్పింగ్స్‌ చూపించి ఈమె హీరోయినా? అంటూ నిర్మాత తన అసహనాన్ని వ్యక్తం చేశారని విద్యాబాలన్‌ తెలిపారు.  దర్శకుడు తీసుకున్న నిర్ణయం మేరకే ఒప్పుకున్నానని నిర్మాత తమతో అన్నారని విద్యాబాలన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదే కాకుండా మరో తమిళ చిత్రంలో కూడా తనకు చేదు అనుభవం ఎదురయిందని చెప్పుకొచ్చారు. ఆ చిత్రానికి సంబంధించి ఒక రోజు షూటింగ్‌ కూడా జరిగిందని, అందులోని మితిమీరిన హాస్యం తనకు నచ్చకనే ఆ చిత్రం నుంచి వైదొలగానని ఆమె పేర్కొంది. బాలీవుడ్‌లో 2005లో వచ్చిన పరిణిత వంటి పలు విజయాలు అందుకున్నా.. కొన్ని పరాజయాలను కూడా చవిచూసింది. ఆమె తాజాగా అక్షయ​కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘మిషన్‌ మంగల్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు