విద్యుల్లేఖ పాస్ పోర్ట్ ఎలా మిస్ అయ్యింది

6 May, 2016 03:22 IST|Sakshi
విద్యుల్లేఖ పాస్ పోర్ట్ ఎలా మిస్ అయ్యింది

హాస్య నటి విద్యుల్లేఖ విదేశంలో పాస్‌పోర్టు, వీసాలు పోగొట్టుకుని నానా ఇబ్బందులు పడిన విషయం కోలీవుడ్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించింది. హాస్య నటిగా ఇప్పుడే ఎదుగుతున్న నటి విద్యుల్లేఖ. ఈమె థియేటర్ ఆర్టిస్టు. సీనియర్ నటుడు మోహన్‌రామ్ కూతురు. నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రంతో హాస్యనటిగా పరిచయమైన విద్యుల్లేఖ ఆ తరువాత జిల్లా, వీరం, మాస్ తదితర చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ రాజుగారి గది, రన్ రాజా రన్, సరైనోడు చిత్రాలలో నటించి హాస్యనటిగా అక్కడా ఎదుగుతున్నారు. తన బంధువుల అమ్మాయికి త్వరలో పెళ్లి జరగనుంది. దీంతో అంతకు ముందుగా ఆమె తన స్నేహితురాళ్లుతో విదేశీయానం చేయాలని నిర్ణయించుకున్నారు.

వారు ఎంచుకున్న దేశం ఆస్ట్రియా.విద్యుల్లేఖ తన బంధువుల అమ్మాయి, మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఐదురోజుల విహార యాత్రకు ఆస్ట్రియా వెళ్లారు. అక్కడ వియన్నా నగరంలోని ఒక నక్షత్ర హోటల్‌లో బస చేసి, నచ్చిన ప్రదేశాలను చుట్టి చెన్నైకి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు. హోటల్ ఖాళీ చేసి పాస్‌పోర్టు, వీసాలను బ్యాగ్‌లో పెట్టుకుని బయల్దేరారు. అయితే హోటల్ బయటకు వచ్చిన తరువాత నటి విద్యుల్లేఖ తన బ్యాగ్ మిస్ అయిన్న విషయాన్ని గ్రహించారు. వెంటనే హోటల్ మేనేజర్‌కు పరిస్థితిని వివరించారు.

అదే సమయంలో తన ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగశాఖ మంత్రి సుస్మాస్వరాజ్, భారత రాయబారికి, బంధువులకు విషయాన్ని వివరించారు. విద్యుల్లేఖ హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆమెను అడ్రెస్ అడిగినట్లు దిశ మార్చగా మరో వ్యక్తి ఆమె బ్యాగ్‌ను తస్కరించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. విద్యుల్లేఖ పరిస్థితిని అర్థం చేసుకున్న భారత రాయబారి ఆమెకు తాత్కాలిక పాస్‌పోర్టును, వీసాను సిద్ధం చేసి అందించారు. దీంతో ఎంతో ఉద్వేగం, ఉత్కంఠ భరిత వాతావరణం తరువాత సమస్య నుంచి బయట పడ్డారు. విద్యుల్లేఖ మిత్ర బృందం ఆస్ట్రియా నుంచి శుక్రవారం చెన్నైకి చేరుకోనుంది.

>