సాంబార్‌ బుజ్జెమ్మ

30 Jun, 2018 07:33 IST|Sakshi

ఆమె రూపం ప్రత్యేకం...ఆమె గొంతు ప్రత్యేకం. మాట్లాడే భాష కూడా ప్రత్యేకమే. ఆమె తెరపై కన్పించగానే నవ్వులు విరబూయాల్సిందే. రూపం..గొంతు..భాషతో సినీతెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది క్యారెక్టర్‌ కమ్‌ కమెడియన్‌ ఆర్టిస్ట్‌ విద్యుల్లేఖా రామన్‌. సరైనోడు సినిమాలో ‘సాంబార్‌ వదిన’గా..రాజుగారి గది మూవీలో బుజ్జెమ్మగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ చెన్నైలో పుట్టి పెరిగింది. తండ్రి మోహన్‌ రామన్‌ తమిళ నటుడు. మొదట థియేటర్‌ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మాయి తెలుగు భాషను తమిళ యాసతో వెరైటీగా మాట్లాడుతుంది. హైదరాబాద్‌ అంటే ఇష్టమని,  పాతబస్తీలో షాపింగ్‌... పలావ్‌ లాగించడం మరీ ఇష్టమని చెబుతున్న విద్యుల్లేఖ తన సినీ ప్రయాణం..వ్యక్తిగత అభిరుచుల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు..

శ్రీనగర్‌కాలనీ: ఆమె తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. ఏ పాత్ర వేసినా అందులో ఆ పేరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఆమె ఒరిజినల్‌ పేరు చాలా మందికి తెలియదు. తెలుగులో ‘బుజ్జెమ్మ, సాంబార్‌’ అని ముద్దుగా పిలిపించుకుంటూ ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇంకా గుర్తుపట్టలేదా.. అదేనండీ.. ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్‌కు తమిళ సాంబార్‌ వదినగా, ‘రాజుగారి గది’లో బుజ్జెమ్మగా, ‘రన్‌ రాజా రన్‌’లో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించిన నటి. బొద్దుగా చురుకుదనానికి కేరాఫ్‌గా కనిపించిందే ఆమె అసలు పేరు ‘విద్యులేఖా రామన్‌’. తెలుగు, తమిళ పరిశ్రమలో లేడీ స్టార్‌ కమెడియన్‌గా చాలా సుపరిచితురాలు. తెలుగు భాషను తమిళ వాసనలో మాట్లాడే ఈ పాప.. ‘సాక్షి’తో తన చిత్రసీమ ప్రయాణాన్ని పంచుకుంది. ఆ వివరాలు బుజ్జెమ్మ అలియాస్‌ విద్యుల్లేఖా రామన్‌ మాటల్లోనే..

నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. నాన్న మోహన్‌ రామన్‌ తమిళ నటుడు. రజనీకాంత్, కమలహాసన్‌ లాంటి స్టార్లతో పాటు పలు ప్రముఖ సీనియల్స్‌లో నటించారు. నేను విజువల్‌ ఎఫెక్టŠస్‌ అండ్‌ మీడియా కమ్యునికేషన్స్‌లో డిగ్రీ చేశాను. మా నాన్న ప్రభావం నాపై పడిందేమో.. నేనూ థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాను. పదేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూ ‘అను’ అనే ట్రూప్‌ను ప్రారంభించాను. దానిద్వారా ప్రదర్శనలు ఇచ్చి అవార్టులు సైతం అందుకున్నాను. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా స్టేజ్‌ ఫియర్‌ పోయి సినిమాల్లో నటించడానికి చాలా దోహదపడింది.

ఒకేసారి తెలుగు, తమిళంలో నటించా..  
గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా తీస్తున్నారు. ఒక కొత్త అమ్మాయిని క్యారెక్టర్‌ కోసం వెతుకున్న సమయంలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా నా ప్రదర్శన చూసిన చిత్ర యూనిట్‌ ఆయనకు పరిచయం చేశారు. ఆడిషన్‌ తర్వాత చిత్రంలో క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమానే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఆ తర్వాత రన్‌రాజారన్, సరైనోడు, రాజుగారి గది, తొలిప్రేమ, ఆనందోబ్రహ్మ, నిన్నుకోరి, భాగమతి, ధృవ, డీజే.. ఇలా తెలుగులో 35 చిత్రాలు చేశాను. తమిళంలో విజయ్, అజిత్‌ లాంటి స్టార్స్‌తో పాటు మొత్తం 26 సినిమాలు, కన్నడలో మూడు చిత్రాల్లోను నటించారు.

సొంతంగా డబ్బింగ్‌..
మొదటి సినిమా చేసేనాటికి నాకు తమిళం తప్ప ఒక్క ముక్క తెలుగు రాదు. అయినా సరే కొత్త వాయిస్‌ ఉంటే బాగుంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నాతో డబ్బింగ్‌ చెప్పించారు. ఆ తర్వాత అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. కొత్త వాయిస్‌ కావడంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను కూడా. రన్‌ రాజా రన్, రాజుగారి గది, సరైనోడు చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఎంతగా అంటే నా అసలు పేరు ఎవరూ గుర్తుంచుకోలేదు.. ఆ చిత్రల్లోని పాత్రల పేరుతోనే పిలుస్తున్నారు.  

తెలుగు ఫుడ్‌కి ఫిదా అయిపోయా..
నాకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమా.. హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం. పాతబస్తీ అంటే మరీ ఇష్టం. అక్కడి కట్టడాలు అపురూపంగా ఉంటాయి. ఇక్కడి సంస్కృతి చాలా గొప్పది. పాతబస్తీలో షాపింగ్‌ అంటే ఇష్టం.. హైదరాబాద్‌ బిర్యానీ కంటే పలావ్‌.. భీమవరం చేపల పులుసు, పీతలు, రొయ్యలు, స్పైసీ పుడ్‌ ఇష్టంగా తింటాను. నన్ను నేను మైమరపించేలా తెలుగు వంటకాలుంటాయి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, బేగంబజార్, ఔటర్‌రింగ్‌ రోడ్‌లో లాంగ్‌ డ్రైవ్‌ ఇష్టం.

పవన్‌ కల్యాణ్‌తో సినిమా నా డ్రీమ్‌..
తెలుగులో పవర్‌స్టార్‌తో సినిమా చేయాలని నా కోరిక.. కానీ తీరేలా లేదు. అవకాశం ఉంటే తప్పక చేస్తాను. మెగాస్టార్‌ చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇది కుదురుతుంది అనుకుంటున్నాను. అన్ని రకాల క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం.. కానీ ఇష్టంతో చేయాలి. దానితో పాటు సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అఖిల్, నితిన్, నిఖిల్, నాగచైతన్య సినిమాల్లో నటిస్తున్నాను.  

500 చిత్రాలు చేయాలి
తెలుగు, తమిళ భాషల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన మహానటుల్లా నా కెరీర్‌లో 500 చిత్రాలు చేయాలని ఉంది. దేవుడి కృప ఉంటే తప్పక చేస్తాను. సినిమాల్లో హెల్తీ కామెడీ రావాలి. సైజ్‌లు, కలర్‌ను పదేపదే అవహేళన చేసే విధంగా కాకుండా ఓ మోతాదులో హెల్తీ కామెడీ ఉంటే బాగుంటుంది. లేడీ కమెడియన్స్‌ పరిశ్రమలో లేరు. ప్రతిభ ఉన్న వారు తప్పక రావాలి. తమిళంలో కంటే తెలుగులో అధికంగా అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. అన్నట్టు నా అసలు పేరు విద్యుల్లేఖా రామన్‌.. అంటూ ముగించారు. 

మరిన్ని వార్తలు