అప్పుడు మదర్‌.. ఇప్పుడు బ్రదర్‌

11 Nov, 2017 00:31 IST|Sakshi

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మార్క్‌ సంపాదించుకున్నారు విజయ్‌ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలతో వరుస కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకుంటున్న ఆయన నటించిన  తాజా చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్‌ దర్శకత్వంలో రాధికా శరత్‌ కుమార్, ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌కు తన నటనతో బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ వర్షాన్ని కురిపించారు విజయ్‌.

‘ఇంద్రసేన’ చిత్రంలో బ్రదర్‌ సెంటిమెంట్‌తో ఆకట్టుకోనున్నారు. బ్రదర్‌ సెంటిమెంటే కాదు.. హై ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్స్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు–సాహిత్యం: భాష్యశ్రీ, సంగీతం–కూర్పు: విజయ్‌ ఆంటోని, కెమెరా: కె.దిల్‌రాజ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: శాండ్రా జాన్సన్‌.

మరిన్ని వార్తలు