ఐదు వందలు కొట్టేశాడు!

2 Mar, 2017 01:41 IST|Sakshi
ఐదు వందలు కొట్టేశాడు!

విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా లెజెండ్‌ సినిమా పతాకంపై ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్‌ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి సమర్పకులు. మార్చి 3న అంటే.. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి హీరో విజయ్‌ దేవరకొండ చెప్పిన సంగతులు....

స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఫోనులు చేసి ‘ద్వారక’ గురించి అడుగుతుంటే.. ‘అరే, మళ్లీ మన సినిమా విడుదలకు వచ్చేసింది’ అనే ఎగ్జయిట్‌మెంట్‌ వస్తుంది. ‘పెళ్లి చూపులు’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకూ, వాళ్లు పెట్టిన టైమ్, మనీకి తగ్గ వినోదం దొరుకుతుంది.

ఈ సినిమాలో ఎర్రశీను అనే పాత్రలో నటించాను. మనుగడ కోసం దొంగతనాలు చేసే స్థాయికి దిగజారతాడు. పరిస్థితుల ప్రభావం వల్ల బాబాగా మారతాడు.

టీవీల్లో దొంగ బాబాల మాయలు – మంత్రాలు అనే వార్తలు చూసేవాణ్ణి. ఓసారి డిగ్రీలో ఉన్నప్పుడు నేనూ, నా స్నేహితుడు రోడ్‌ పక్కన బైక్‌ మీద మాట్లాడుకుంటుంటే... సడన్‌గా ఓ ఫకీరు వచ్చి రెండు మూడు మ్యాజిక్స్‌ చేసి మా దగ్గర 500లు కొట్టేశాడు. ‘ద్వారక’ చిత్రీకరణకు ముందు కొన్ని యూ ట్యూబ్‌ వీడియాలు చూశా. మా దొంగ బాబా కంటే వాళ్లు చేసిన వి చాలా ఓవర్‌గా ఉన్నాయి. మా స్క్రిప్ట్‌కి అంత ఓవర్‌ సెట్‌ కావడం లేదని దర్శకుడు చెప్పింది ఫాలో అయ్యా

దర్శకుడు శ్రీనివాస్‌ రవీంద్రగారు 17 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందు నేను కేబీఆర్‌ పార్కులో మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్‌ చేసేవాణ్ణి. నన్ను అక్కడ చూశారు. అప్పుడే ఈ కథ చెప్పారు. ‘ఎవడే..’ విడులైన తర్వాత మా నిర్మాతలు సిన్మా తీయడానికి ముందుకొచ్చారు. విజయ్‌ హీరోగా బాగుంటాడని కన్విన్స్‌ చేశారు. ‘ద్వారక’ కథ చెప్పే ముందు దర్శకుడు ఓ ఫిలాసఫీ చెప్పారు. ‘‘సినిమా ఎలా వస్తుందనేది మనకు తెలీదు. కానీ, మన కంటెంట్‌ ఏంటో మనకు తెలుసు. ‘రిలీజ్‌ తర్వాత ఏం రాశార్రా! ఏం చేశార్రా’ అని ప్రేక్షకులు అనుకోవాలి. జీవితంలో మనకంటూ ఓ పేరు రావాలి’’ అనేవారు. ఆయనలో నాకది నచ్చింది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలెబెట్టుకున్నాననే అనుకుంటున్నా.

డీఓపీ శ్యామ్‌ కె. నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి, ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, పృథ్వీ, ‘షకలక’ శంకర్‌.. భారీ స్టార్‌ కాస్ట్, మంచి టెక్నీషియన్లతో సినిమా చేశాం. ‘పెళ్లి చూపుల’కు ముందే మా నిర్మాతలు కథపై నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టారు. పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు. వాళ్ల నమ్మకానికి హ్యాపీ.

మన పల్లెటూళ్లు, సిటీల్లో ప్రజలందరూ మంచి బాబాలు, దొంగ బాబాల గురించి వింటుంటారు. మా సినిమాలో అదే చెప్పాం. సరదా సరదాగా సాగే కథ చివర్లో ఓ మంచి విషయం కూడా చెప్పాం. ప్రతి ఒక్కరికీ కథ, సినిమా కనెక్ట్‌ అవుతాయి. సినిమా మంచి హిట్టవుతుందనే నమ్మకముంది.

>