మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు

21 Aug, 2019 02:10 IST|Sakshi
వల్లభ, భీమనేని శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా, కె.ఎస్‌. రామారావు

– కేయస్‌ రామారావు

‘‘కేయస్‌ రామారావుగారిని మేము ‘పప్పా’ (డాడీ) అని పిలుస్తాం. ఆయన ప్రతిరోజూ సెట్‌లో ఉంటారు. మీరు రిలాక్స్‌ అవ్వండి.. మేం చూసుకుంటాం అంటే.. నాకు నచ్చింది, వచ్చింది సినిమా.. ఇదే నా లైఫ్‌. ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం అంటారు. ఇన్ని సినిమాలు చేసినా ఆయన ఇప్పటికీ సినిమాలను ప్రేమిస్తారు’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు, ‘వెన్నెల’ కిషోర్‌ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్‌’. నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌ సార్‌.. మీరు ఈ లైఫ్‌లో చేసినన్ని సినిమాలు నా లైఫ్‌టైమ్‌లో చేయలేనేమో? మీరు చేసిన సినిమాలు, పాత్రలు, అనుభూతులు ఇప్పుడు మా వల్ల కాని పని.. మీలాంటి వారే మాకు స్ఫూర్తి. ఐశ్వర్య నటించిన కొన్ని తమిళ చిత్రాలు చూశాం.. చాలా బాగా చేసింది. మీరు (ఫ్యాన్స్‌) అన్ని సినిమాలను సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తారని కోరుకుంటున్నా. మన సినిమాలు వస్తున్నాయ్‌.. త్వరలోనే దింపుతున్నాం. నీటిని వృథా చేయకండి. 2022కి తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి లీకేజీలను అరికడదాం. ఓ రోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. పెట్రోల్‌లా నీళ్లు కూడా లిమిటెడ్‌గా ఉన్నాయి.. పొదుపుగా వాడండి’’ అన్నారు.

రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో 40 ఏళ్ల క్రితం ‘ఛాలెంజ్‌’ అనే సినిమాలో తొలిసారి నటించా. ఆ తర్వాత అనుకోకుండా నేను కామెడీ హీరోగా బాగా సక్సెస్‌ అయ్యాక కూడా నాతో ‘ముత్యమంత ముద్దు’ అని అద్భుతమైన సినిమా చేయించారాయన. ఈ సంస్థ ఇంతకాలం ఈ సంస్థ అద్భుతమైన స్థానంలో ఎందుకుంది అంటే.. మంచి సినిమాలు, గుర్తుండే సినిమాలు, సామాజిక సృహ ఉన్న సినిమాలు అందించింది కాబట్టి. నాలుగు మంచి సినిమాలు వెనకేసుకున్న బ్యానర్‌ కాబట్టి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది. ఒరిజినల్‌ కంటే రీమేక్‌లు బాగా తీశాడు కాబట్టి భీమనేని శ్రీనివాస్‌కి ఇంత మంచి పేరుంది. ‘కణ’ సినిమా కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ బాగుంటుంది. నా జీవితంలో ఓ 10 సినిమాలుంటే వాటిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.
 
భీమనేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పుడూ రీమేక్‌ని రీమేక్‌లా చేయలేదు. ఫ్రెష్‌ స్టోరీలా భావించి మన నేటివిటీకి తగ్గట్టు చేసుకుంటూ వచ్చా.. అందుకే హిట్స్‌ సాధించా. ఈ మధ్య క్రికెట్‌ నేపథ్యంలో వచ్చినవి మేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌.. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇష్టమైన రంగాల్లో  ప్రోత్సహించాలి. కౌసల్య పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది’’ అన్నారు.

కేయస్‌ రామారావు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం క్రాంతి మాధవ్‌. విజయ్‌ దేవరకొండతో మేం చేయనున్న సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్‌ గురించి చెప్పాడు. ఆ సమయంలో ఐశ్వర్య నటించిన ‘కణ’ టీజర్‌ చూసి బాగుందని రీమేక్‌ చేశాం. ‘కణ’ కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకి తెలుగులోనే తను ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే ఇక్కడ మొదటి సినిమా కాబట్టి. నా సినిమాల్లో కథ బాగుందంటే అవి తయారు చేసిన వారి గొప్పదనం అది.

వారందరూ గొప్ప రచయితలు, దర్శకులు, నటులు.. ఎంతో గొప్పగా చేయబట్టి, అవి నాకు నచ్చబట్టి.. ఓ నిర్మాతగా నేను కూడా వ్యాపారం చేసుకోవచ్చని భావించా. సినిమా వ్యాపారం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్‌ అయితే వాటిల్లో మన సినిమా గొప్పగా ఉండాలనుకుంటే తప్ప ఆ సినిమా బతికి బట్టకట్టలేని పరిస్థితి. అలాంటి సినిమాలు చేయడానికి కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె.విశ్వనాథ్, అజయ్‌... ఇలా ప్రతివాళ్లూ కష్టపడ్డారు.

నా గురించి, నా బ్యానర్‌ గురించి వారంతా కష్టపడితేనే గొప్ప సినిమాలొచ్చాయి. 2019లో ఓ మంచి సినిమా చూశామని సంతృప్తిగా చెప్పుకునే చిత్రమిది. మా సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న నా స్నేహితులకు థ్యాంక్స్‌.. కొనటానికి రాని, పెద్ద సినిమాలే కొనే మిత్రులకు కూడా థ్యాంక్స్‌.. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్‌ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని నేనే రిలీజ్‌ చేస్తున్నా. ఈ సినిమాని అమ్మటానికి నేను ప్రయత్నించా.. కానీ, ఐశ్వర్యారాజేష్‌ ఏమైనా అమితాబ్‌ బచ్చనా? చిరంజీవినా? అనుకొని ఉండొచ్చు. సినిమా చూస్తే ఆవిడేంటో తెలుస్తుంది’’ అన్నారు.

ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ – ‘‘నా తొలి చిత్రం క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో సైన్‌ చేశా.. అదే ఫస్ట్‌ సినిమా అవుతుందనుకున్నా. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ అయింది. తమిళ్‌లో 25 సినిమాలు చేశా.. ఆ తర్వాత ‘కణ’ నాకు వచ్చింది. ఆ సినిమా నా కల. అది బ్లాక్‌బస్టర్‌ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు. ఇలాంటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం లక్కీ. ఈ సినిమాకి బెస్ట్‌ నటిగా తమిⶠంలో 10 అవార్డులు తీసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు.   కెమెరామేన్‌ ఆండ్రూ, ఏషియన్‌ సినిమాస్, నిర్మాత నారాయణ్‌దాస్, హీరోయిన్‌ రాశీ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు