ముఖ్యమంత్రి అయితే సినిమాల్లో నటించను

4 Oct, 2018 12:15 IST|Sakshi

మనసులో మాట బయటపెట్టిన హీరో విజయ్‌

నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను అని అన్నారు నటుడు విజయ్‌. ఈ స్టార్‌ నటుడికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ బలీయంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకుచాలా కాలం క్రితమే తన సైన్యాన్ని (అభిమానుల్ని) బరిలోకి దింపారు. సామాజిక సేవ పేరిట సమావేశాలను నిర్వహించారు. ఆ తరువాత తన చిత్రాల విడుదల సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు ఆయన రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయనే చెబుతారు.

సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కోరికను నటుడు విజయ్‌ మంగళవారం మరోసారి చెప్పకనే చెప్పారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్‌ ఆడియో ఆవిష్కరణ మంగళవారం చెన్నై, తాంబరంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో నిర్వహించారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అందరి ప్రసంగం విజయ్‌ గురించి, రాజకీయాలపైనే సాగడం విశేషం. చివరకు విజయ్‌ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈయన ఏమన్నారో చూద్దాం.

‘అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు నాయకుడు ఏఆర్‌ రెహ్మాన్‌. ఆయన సంగీతం అందించడం ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు లభించినట్లే. నేను, దర్శకుడు మురుగదాస్‌ కలిసి చేస్తే అది హిట్‌ చిత్రం అవుతుంది. సర్కార్‌ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే మెర్శల్‌ చిత్రంలో కొంచెం రాజకీయం చోటుచేసుకుంది. ఇందులో రాజకీయం దుమ్మురేపుతుంది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్‌ ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. నటి వరలక్ష్మి వద్దు అని ఎవరు అనలేని విధంగా ఈ చిత్రంలో ఆమె నటించారు. విజయం కోసం ఎంతగానైనా కష్టపడవచ్చు. అయితే మా చిత్రం విజయం సాధించకూడదని ఒక వర్గం త్రీవంగా శ్రమిస్తోంది. జీవితం అనే ఆటను చూసి ఆడండి. అసహ్యించుకునే వారిపై ఉమ్మేయండి. విసిగించేవారి వద్ద మౌనంగా ఉండండి. జీవితాన్ని జామ్‌జామ్‌గా గడిపేద్దాం అని అన్నది ఎవరో తెలియదు గానీ, ఆ వ్యాఖ్యలను నేను అనుసరిస్తున్నాను. మీరు అనుసరించండి. సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయనున్నాం. నేను చిత్రం గురించి చెబుతున్నాను. నచ్చితే ఈ చిత్రానికి ఓటేయండి. సర్కార్‌ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించలేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను’ అని నటుడు విజయ్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలిసిపోతుంది కదూ!

రాజకీయ ప్రకంపనలు
సర్కార్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై విజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు నాయకులు స్వాగతిస్తున్నా, మరి కొందరు, ముఖ్యంగా అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ స్పందిస్తూ విజయ్, అజిత్‌ లాంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్ర మంత్రి ఉదయకుమార్‌ స్పందిస్తూ సర్కార్‌ సినిమాను సర్కస్‌తో పోల్చారు.  విజయ్‌ చిత్రాలు చేసుకోవడమే మంచిదని, రాజకీయాల్లో ఆయన రాణించలేరని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు