చిత్ర పరిశ్రమలో సమస్యలెన్నో!

8 Oct, 2018 11:27 IST|Sakshi
విజయ్‌సేతుపతి

సినిమా: చిత్ర పరిశ్రమలో సమస్యలు చాలానే ఉన్నాయని నటుడు విజయ్‌సేతుపతి అన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం 96. నటి త్రిష కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.నందగోపాల్‌ నిర్మించారు. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత గరువారం తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే విడుదలకు ముందు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. అయినా అన్ని సమస్యలను అధిగమించి సక్సెస్‌ బాటలో పయనిస్తున్న సందర్భంగా 96 చిత్ర యూనిట్‌ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ మీట్‌ను శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఇప్పుడు సినిమా పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన పరియేరుమ్‌ పెరుమాళ్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటోందన్నారు. జాతి వివక్షతను, దాని తీవ్రతను చక్కగా చెప్పిన చిత్రం అని కొనియాడారు.

ఇక తమ చిత్రం 96 విషయానికొస్తే దీని విజయం పూర్తిగా దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కే చెందుతుందన్నారు. అయితే ఆ విజయాన్ని చూస్తే అందరూ తమకు సొంతం అని భావించేలా చేసిందన్నారు. తాను తన అనుభవంతోనే ఈ లోకాన్ని చూస్తున్నానని అన్నారు. అదే అనుభవంతో ఇక్కడ మాట్లాడుతున్నానని, ఈ చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. అందుకు ఎవరిని తప్పు పట్టలేమన్నారు. ఎవరో ఎవరినో లక్ష్యంగా చేసి చేసిన తప్పుల కారణంగా ఈ సమస్యలని పేర్కొన్నారు. ఇదంతా ఒక చట్రం లాంటిదని, ఇందులో ఏది ఆరంభం, ఏది అంతం అన్నది చెప్పడం కష్టం అన్నారు. అందుకే ఈ అంశం గురించి ఎవరిపైనా నేరం మోపడం ఇష్టం లేదని అన్నారు. 96 చిత్ర విడుదల కోసం నిర్మాత నందగోపాల్‌ పడ్డ కష్టాన్ని తాను కళ్లారా చూశానన్నారు.

అది తనను బాధించిందన్నారు. అయినా కొన్ని సందర్భాల్లో వేరే దారి ఉండదని అన్నారు. ఎందుకంటే జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి వెళ్లతానన్నారు. ఎవరిపై ఎవరు ఎంత భారం మోపుతారో? ఎవరు ఎంత భారం భరిస్తారో? వారే ఇంకా ఉన్నత స్థాయికి వెళతారని అన్నారు. తన జీవితంలో ఇలా పలు మార్లు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఇలాటివి తన చిత్ర యూనిట్‌కు మాత్రమే జరగలేదని, ఎంతో కాలంగా జరుగుతున్నాయని విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత నందగోపాల్, దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ చిత్ర యూనిట్‌ వర్గాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు