నడిగర్‌ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు

14 Jun, 2019 10:10 IST|Sakshi

పెరంబూరు:  నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్‌ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామిశంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్‌దాస్‌ జట్టు ముందుంది. నడిగర్‌ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్‌ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు.

దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్‌ జట్టు విజయకాంత్‌ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్‌ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్‌ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు.

ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్‌ నటుడు,నడిగర్‌సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్‌ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన  చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు