విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్?

10 Jul, 2016 23:45 IST|Sakshi
విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్?

సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్రానికి అద్భుతమైన కథ అందించారాయన. ఇప్పుడు కూడా విజయేంద్రప్రసాద్ ఓ హిందీ సినిమాకి కథ అందించే పని మీద ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఒకే ఒక్కడు’ హిందీ రీమేక్ ‘నాయక్’ సీక్వెల్‌కు కథ అందిస్తున్నారాయన. అలాగే అజయ్ దేవగణ్ కోసం ఓ కథ రాస్తున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది.


‘కబీర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుందట. 1992లో వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని కథగా రాస్తున్నట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భారతదేశంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని టాక్. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లాని నిర్మించనున్నారు.