'పక్కా' ధోని అభిమానిగా..

7 Oct, 2017 10:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: అభిమానం కలగాలే గానీ, అది ఎంత వరకైనా తీసుకెళుతుంది. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని అంటే ఎవరికి అభిమానం ఉండదు. అలా ఆయన వీరాభిమానుల్లో ఒకడిగా విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం పక్కా. బెన్ స్ట్రోడియం పతాకంపై టి.శివకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు సరసన నిక్కీగల్రాణి, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఒక ప్రధాన పాత్రలో నిర్మాత టి.శివకుమార్‌ నటించడం విశేషం. సి.సత్య సంగీతాన్ని, శరవణన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి చిత్ర కథానాయకుడి విక్రమ్‌ప్రభు తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్, కామెడీ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో తాను ఉత్సవాల్లో బొమ్మలు విక్రయించే దుకాణం నడుపుకునే యువకుడిగా నటిస్తున్నానని, క్రికెట్‌ క్రీడ అంటే మహాపిచ్చి అని, దీంతో ధోని అభిమాన సంఘాన్ని నడుపుతానని చెప్పారు.

ఇక నటి నిక్కీగల్రాణి రజనీకాంత్‌ అంటే పడి చచ్చే అమ్మాయిగా ఆయన అభిమాన సంఘ నాయకురాలిగా నటిస్తున్నారన్నారు. ఒక గ్రామ పెద్ద కూతురిగా నటి బిందుమాధవి నటిస్తున్నారని తెలిపారు. ఈ ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలే పక్కా చిత్రం అని వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంతకు ముందెప్పుడూ చేయని యథార్థంతో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు, తనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పక్కా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చిత్ర నిర్మాత టి.శివకుమార్‌ మాట్లాడుతూ పక్కా చిత్రంలో తాను ఒక కీలక పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని అన్నారు. తదుపరి ధర్మన్ అనే చిత్రాన్ని నిర్మించనున్నానని, త్వరలోనే ఆ చిత్ర వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి బి.శరవణన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎస్‌ఎస్‌.సూర్య నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు