ఉత్తర చెన్నై నేపథ్యంగా స్కెచ్‌

19 Apr, 2017 02:37 IST|Sakshi
ఉత్తర చెన్నై నేపథ్యంగా స్కెచ్‌

ఉత్తర చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా స్కెచ్‌ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌చందర్‌ అంటున్నారు. వీ క్రియేషన్స్‌ కలైపులి ఎస్‌.థాను సమర్పణలో మూవింగ్‌ ఫ్రేమ్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం స్కెచ్‌. సియాన్‌ విక్రమ్, మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, ఆర్‌కే.సురేశ్, అరుళ్‌దాస్, మలయాళ నటుడు హరీశ్, శ్రీమాన్, రవికిషన్,విశ్వంత్, మాలి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ప్రియాంక్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతాన్ని, సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విజయ్‌చందర్‌ నిర్వహిస్తున్నారు.

 చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. ఉత్తర చెన్నై అనగానే ఇప్పటి వరకూ చదవులేని వారు, ఆర్థికంగా ఎదగని వారి గురించే చిత్రాల్లో చూపించారన్నారు. అయితే అక్కడ విద్యాధికులు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారని చెప్పే స్టైలిష్‌ చిత్రంగా స్కెచ్‌ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.

 చిత్రంలో భారీ పోరాట దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే చెన్నైలో బ్రహ్మాండమైన సెట్‌ వేసి 30 రోజులకు పైగా చిత్రంలోని పలు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్‌ కణవే కణవే..పుదుకణవే అనే పాటను పాడడం విశేషంగా పేర్కొన్నారు.