అందుకే...56తో ఆపేశా : విక్రమ్

19 Jan, 2015 23:20 IST|Sakshi
అందుకే...56తో ఆపేశా : విక్రమ్

‘‘సినిమా అంటే నాకు ఇష్టం అనేకన్నా, పిచ్చి అంటే సబబు. అందుకే, సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా నేను రెడీ అయిపోతా’’ అని చెప్పారు విక్రమ్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా విక్రమ్, అమీ జాక్సన్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. తొలుత విక్రమ్ మాట్లాడుతూ -‘‘చూసినవాళ్లందరూ బాగుందంటున్నారు. కొంతమంది క్రిటిక్స్, సినిమా పరిశ్రమకు చెందినవాళ్ల స్పందన వేరే విధంగా ఉంది. అయినా ప్రేక్షకులు బాగా చూస్తున్నారు కాబట్టి, రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఒకవేళ చెత్త సినిమా అయితే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు? సినిమాలో సందేశం లేదంటున్నారు. కానీ, ప్రేమకు అందంతో పని లేదన్నది సందేశమే కదా. అయినా శంకర్ సినిమా అంటే సందేశం ఉండి తీరాల్సిందే అనుకోవడం సబబు కాదు’’ అన్నారు.
 
 ఈ చిత్రంలో బాడీ బిల్డర్‌గా, మోడల్‌గా, గూనివాడిగా కనిపించడానికి మీరు చేసిన కసరత్తులు గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు -‘‘బాడీ బిల్డింగ్ కోసం మామూలుగా ఏడాది పడుతుంది. కానీ, నేను ఐదు నెలల్లోనే చేశాను. అలాగే, స్లిమ్ లుక్ కోసం చాలా కసరత్తులు చేశాను. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టేద్దాం అని శంకర్ అన్నప్పటికీ, నేను వినకుండా 56 కిలోల బరువుకు చేరుకున్నాను. ఇంకో ఆరు కిలోలు తగ్గుతానంటే, ‘శరీరం అనేది ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని పదిలంగా కాపాడుకోవాలి. ఇంతకన్నా బరువు తగ్గితే అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది’ అని డాక్టర్ హెచ్చరించారు. అందుకే 56తో ఆపాను. దాదాపు ఎనిమిది నెలల పాటు సరైన తిండి తినలేదు. ఇంట్లో అయితే మా ఆవిడ బిర్యానీ చేసినప్పుడల్లా తెగ బాధపడేది. జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకునేవాణ్ణి. ఒకానొక దశలో కొంచెం బాధగానే అనిపించింది. కానీ, సినిమా మీద ఉన్న ప్రేమ ఆ బాధను అధిగమించేసింది’’ అన్నారు.
 
  ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించడంవల్ల చాలా సినిమాలు వదులుకుని ఉంటారు కదా? అనడిగితే ‘‘అవును. ఈ మూడేళ్లల్లో ఓ ఆరు సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ‘ఐ’లాంటి అద్భుతమైన సినిమా కోసం ఆరు చెత్త సినిమాలు వదులుకున్నానని సరిపెట్టుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రం నటిగా తన అభివృద్ధికి ఉపయోగపడిందని అమీ చెబుతూ -‘‘ఇప్పటి వరకు ఏ సినిమాకీ అందుకోనన్ని అభినందనలు ఈ చిత్రానికి అందుకున్నాను. నా పాత్రకు కూడా నటనకు అవకాశం ఉండటంతో సంతృప్తిగా ఉంది’’ అన్నారు. ‘ఎవడు’ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయనీ, అయితే అవి పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో అంగీకరించలేదనీ, ఒకవేళ మంచి అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా చేస్తాననీ అమీ చెప్పారు.