ఆస్కార్‌కి భారత్‌ తరపున ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’

22 Sep, 2018 14:25 IST|Sakshi
ఆస్కార్‌ అవార్డ్‌ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్‌ నుంచి ఎంపికైన విలేజ్‌ రాక్‌స్టార్స్‌ చిత్రం

ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న  ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’  చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌కు భారత్‌ తరపున ఈ అస్సాం చిత్రం ఎంపికైనట్లు తెలిసింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఆస్కార్‌ అవార్డుకు పోటీపడుతోందని ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) శనివారం ప్రకటించింది. 2019 ఆస్కార్‌ అవార్డుల బరిలో భారత్‌ నుంచి 28 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’తో పాటు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’‌, ఆలియాభట్‌ ‘రాజీ’, రాణీముఖర్జీ ‘హిచ్‌కీ’, శూజిత్‌ సిర్కార్‌ ‘అక్టోబర్‌’  చిత్రాలున్నాయి. ఇన్ని భారీ చిత్రాలతో పోటీ పడి ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’‌ చిత్రం ఆస్కార్‌ అవార్డు నామినేషన్‌కు ఎంపికైనట్లు ఎఫ్‌ఎఫ్‌ఐ తెలిపింది.

అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన పదేళ్ల అమ్మాయి ‘ధును’కు గిటార్‌ అంటే ఎంతో ఇష్టం. అంతేకాక తనే సొంతంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ధును తనకు వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించింది.. చివరకు తన కలను ఎలా సాకారం చేసుకుని రాక్‌స్టార్‌గా ఎదిగింది అనేదే ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ కథ. రీమా దాస్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో ఉత్తమ ఫీచర్‌ సినిమాగా జాతీయ అవార్డు సాధించింది. అంతేకాక ఈ చిత్రంలో ధును పాత్రలో నటించిన భనిత దాస్‌ ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవార్డును అందుకుంది.

గతేడాది వచ్చిన ‘న్యూటన్‌’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన ‘కోర్ట్‌’, ‘లయర్స్‌ డైస్‌’, ‘విసరానై’, ‘ద గుడ్‌ రోడ్‌’ వంటి చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్‌ ఐదు చిత్రాల్లో నిలవలేదు. చివరిసారిగా 2001లో ‘లగాన్‌’ చిత్రం మాత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్‌ ఐదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు 1958లో ‘మదర్‌ ఇండియా’, 1989లో ‘సలాం బాంబే’ కూడా టాప్‌ 5కి వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఒక్క భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్‌ అవార్డ్‌ రాలేదు.

మరిన్ని వార్తలు