అక్కడ మళ్లీ చెలరేగిన హింస

4 Apr, 2016 12:41 IST|Sakshi


వారణాసి

వారణాజిల్లా జైలులో ఖైదీల తిరుగుబాటు  రేపిన  అలజడి ఇంకా చల్లారకముందే మరోసారి  ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  ఆదివారం రాత్రి మళ్లీ రెచ్చిపోయిన ఖైదీలు మరో జైలు అధికారిని గాయపరిచి  బ్యారక్ 5 కు నిప్పుపెట్టారు.  దీంతో  జిల్లా కారాగారంలో మళ్లీ హింస చెలరేగడం  ఉద్రిక్తతకు  దారి తీసింది.

పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం  శనివారం జరిగిన అల్లర్లలో తమపై అక్రమంగా కేసులు బనాయించారంటూ  ఖైదీలు ఆగ్రహానికి గురయ్యారు.  బ్యారక్  8 లో  ఖైదీలు  జైలు అధికారి హరీంద్ర సింగ్ పై తిరగబడ్డారు.   వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సెక్యూరిటీ బలగాలను  జైలుకు తరలించారు. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు లోనికి  ప్రవేశించకుండా ఖైదీలు అడ్డుకున్నారు.  భద్రతా బలగాలు  జైలు  ఆవరణలోకి రావడానీకి వీల్లేదంటూ మరింత రెచ్చిపోయిన ఖైదీలు బ్యారక్ 5 కు నిప్పు పెట్టారు.   దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,  అధికారులు మంటలను ఆర్పివేశారు. అనంతరం  జైలులో   ఏవైనా  ఆయుధాలు దాచి ఉంచారనే అనుమానంతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించి,  ఎలాంటి  అనుమానిత ఆయుధాలు లేవని తేల్చారు. అయితే    ఈ ఘర్షణకు బాధ్యులైన వారిని  ఎవర్నీ వదిలిపెట్టేది లేదని జిల్లా కలెక్టర్ రాజమణి యాదవ్ ప్రకటించారు. శని, ఆదివారాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై పూర్తి  విచారణ జరుగుతుందని తెలిపారు.

కాగా వారణాసి జైలులో జైలు అధికారులపై తిరగబడిన ఖైదీలు జైలు ఉన్నతాధికారిని తీవ్రంగా  గాయపర్చిన సంగతి తెలిసిందే. బ్యారక్ లను తమ ఆధీనంలోకి తీసుకొని హింసకు దిగడం ఉద్రిక్తతను రాజేసిన సంగతి తెలిసిందే.