నో రెస్ట్‌... ఓన్లీ వర్క్‌

24 Aug, 2017 00:04 IST|Sakshi
నో రెస్ట్‌... ఓన్లీ వర్క్‌

– ధనుష్‌
‘పిల్లలకు ఆడుకోవడం ఎంత ఇష్టమో.. నాకు పని చేయడమంటే అంత ఇష్టం. చేసే పనిని ఎంజాయ్‌ చేయాలనుకుంటా. నాకసలు రెస్ట్‌ అవసరం లేదు. పని చేయడమే రిలాక్సేషన్‌’’ అని హీరో ధనుష్‌ అన్నారు. ధనుష్, అమలాపాల్‌ జంటగా సౌందర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌. థాను నిర్మించిన ‘వీఐపీ 2’ ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ధనుష్‌ మాట్లాడుతూ– ‘‘రఘువరన్‌ బీటెక్‌’ సినిమా తెలుగులో మంచి హిట్‌ అవడంతో సీక్వెల్‌ను రెండు భాషల్లోనూ తీశాం.

‘వీఐపీ 2’లో వినోదం, భావోద్వేగాలు, మాస్‌ అంశాలన్నీ ఉంటాయి. తెలుగులో స్ట్రయిట్‌ ఫిల్మ్‌గా ‘వీఐపీ 2’ కరెక్ట్‌ అనిపించింది. తమిళ్‌లో మా సినిమాకి వసూళ్లు బాగున్నాయి. కానీ, క్రిటిక్స్‌ వేరేలా రాశారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయాలనుకున్నాం. కానీ, తెలుగులో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో చేయలేదు. తమిళంలో ఆ డేట్‌ దాటితే తర్వాత మంచి డేట్‌ లేదని అక్కడ రిలీజ్‌ చేశాం. ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్‌ రాశా. కానీ, సినిమా ఎలా మొదలుపెట్టాలో క్లారిటీ లేదు. సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్‌గా ఉంటాయి.

అందుకే డైరెక్టర్‌గా సౌందర్య బెటర్‌ అనిపించింది. నేను డైరెక్ట్‌ చేసిన ‘పవర్‌పాండి’ని తెలుగులో డబ్‌ చేస్తాం. ‘మారి 2’ తెలుగు, తమిళ భాషల్లో తీయనున్నాం’’ అన్నారు. సౌందర్యా రజనీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారితో (నాన్న) పనిచేయాలని ఎవరికైనా ఉంటుంది. తొలి సినిమాకే నాకా అవకాశం రావడం అదృష్టం. ధనుష్‌సార్‌ కూడా మంచి యాక్టర్‌. వారిని డైరెక్ట్‌ చేయడం నేను ఎంజాయ్‌ చేశా. డైరెక్టర్‌ అంటే డైరెక్టరే. అందులో ఆడ, మగ అనే తేడా ఉండదు. బంధుప్రీతి అన్నది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కానీ, ఏ రంగంలో అయినా ప్రతిభ ఉంటేనే మనం నిలబడగలం’’ అన్నారు.