వారి విజయమే మా లక్ష్యం!

18 May, 2018 07:53 IST|Sakshi
ఇరుంబుతిరై చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: నిర్మాతల విజయమే తమ లక్ష్యం అని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ పేర్కొన్నారు. ఈయన తాజాగా నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబుతిరై. సమంత కథానాయకిగా, నటుడు అర్జున్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పీఎస్‌.మిత్రన్‌ దర్శకుడు. గత వారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతుండడంతో గురువారం మధ్యాహ్న చిత్ర యూనిట్‌ స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు అర్జున్‌ మాట్లాడుతూ తన వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన విశాల్‌ ఆ తరువాత తన సలహాతో నటుడిగా మారి, ఆపై నిర్మాత, నడిగర్‌సంఘం, కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు ఇలా ఎదగడం తనకు గర్వంగా ఉందన్నారు. దర్శకుడు మిత్రన్‌ ఈ చిత్రాన్ని మలచిన తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
ఇరుబుతిరై చిత్రం తనకు మంచి అనుభవం అని అనంతరం మాట్లాడిన  చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్‌ అన్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌గా నటించడానికి అంగీకరించడం విశేషం అన్నారు. ఇక కథానాయకిగా నటించిన సమంత గురించి చెప్పేతీరాలని అన్నారు. ఎందుకంటే వివాహానంతరం కథానాయికలుగా రాణించలేరనే దాన్ని ఆమె బ్రేక్‌ చేశారని అన్నారు.  ఇరుబుతిరై చిత్ర విడుదలను అడ్డుకోవడానికి చాలా విధాలుగా కొందరు ప్రయత్నించారని అన్నారు. చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయడానికి సిద్ధం కాగా, అంతకు ముందు రోజు అంటే 10 తేదీ రాత్రి 8 గంటల నుంచి తాను అనుభవించిన టెన్షన్‌ మాటల్లో చెప్పలేనన్నారు. డబ్బు విలువ అప్పుడే తనకు తెలిసిందన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడినైన తనకే అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు.

అయినా నిర్మాతల మండలి ఎప్పుడూ నిజాయితీగా ఉంటుందని, నిర్మాతలు విజయాలు సాధించేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు.అదే విధంగా చిత్రంలో ఆధార్‌ కార్డు, డిజిటల్‌ ఇండియా వంటి అంశాల గురించిన వాస్తవాలను చూపించే ప్రయత్నం చేశామన్నారు. అదే విధంగా బ్యాంకు రుణాల విషయంలో జరుగుతున్న మోసాలను చిత్రంలో ఆవిష్కరించామని తెలిపారు. దీనిని  కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారని, అలాంటి వారంతా సినిమా థియేటర్ల ముందు కాకుండా ఏ వళ్లువర్‌కోట్టం వద్దనో, లేదా సెన్సార్‌ కార్యాలయం ఉన్న శాస్త్రీభవన్‌ వద్దనో ఆందోళన చేసుకోవాలని అన్నారు. సెన్సార్‌ అయిన చిత్రం గురించి నిర్మాతలు భయపడాల్సిన అవసరం లేదని విశాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు