ఆధారాలుంటే బయట పెట్టండి: విశాల్

29 Aug, 2016 19:07 IST|Sakshi
ఆధారాలుంటే బయట పెట్టండి: విశాల్

చెన్నై:  తనపై ఆరోపణలు చేసేవాళ్లు ఆధారాలను బయట పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ సవాల్ చేశారు. సోమవారం నటుడు విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమాన  సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాల్ నిన్న స్థానిక ట్రిపుల్‌కేన్‌లోని అరిమా సంఘం, ఎంపీఎస్ పాలీ క్లినిక్ నిర్వాహకులతో కలిసి చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఇది చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరం అని, కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఉచిత వైద్యం పొందవచ్చనని తెలిపారు.

కాగా  నడిగర్‌సంఘంలో అవకతవకలు జరిగినట్లు సంఘ సభ్యులు కొందరు ఆరోపణలతో శనివారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని సంఘ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారాహి అనే సంఘ సభ్యుడు సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చే విధంగా నిర్వహించిన స్టార్స్ క్రికెట్‌కు సంబంధించి కోట్ల రూపాలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై విశాల్ స్పందిస్తూ ఆరోపణలు చేసేవారు ఆధారాలను చూపాలన్నారు. గత సంఘం అవకతవకలకు సంబంధించిన అన్ని వివరాలను మరో 10 రోజులలో బయట పెట్టనున్నట్లు తెలిపారు. తమిళ నిర్మాతల మండలిపై విశాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మండలి నిర్వాహకులు వివరణ అడిగిన విషయం విదితమే. ఈ విషయం గురించి ప్రశ్నంచగా నిర్మాతల మండలి నుంచి వివరణ కోరుతూ తనకు ఎలాంటి లేఖ రాలేదన్నారు. అందువల్ల తాను క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని విశాఖ స్పష్టం చేశారు.