ఆయనవి ఆరోపణలు మాత్రమే: విశాల్‌

11 Jan, 2018 15:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటుడు ఎస్‌వీ. శేఖర్‌ ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవని నడిగర్‌ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఎస్‌వీ.శేఖర్‌ మలేషియాలో సీనియర్‌ కళాకారులకు గౌరవం లభించలేదని, నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు చేస్తూ సంఘం ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి వచ్చిన విశాల్‌ మీడియాతో మాట్లాడారు. మలేషియాలో స్టార్స్‌ క్రికెట్, తదితర కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయన్నారు. కార్యక్రమానికి చేకూరిన నిధుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

ఎస్‌వీ. శేఖర్‌ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. మలేషియాలో సీనియర్‌ కళాకారులందరికీ గౌరవం లభించిందని స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని విశాల్ విజ్ఞప్తి చేశారు. సమ్మె కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది సాధారణ ప్రజలేనన్నారు. రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు... రజనీకాంత్‌ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారని, తన మద్దతు ఎవరికన్నది ఎన్నికల సమయంలో ప్రకటిస్తానని విశాల్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు