విశాల్‌తో ఐసరి గణేశ్‌ ఢీ

9 Jun, 2019 16:06 IST|Sakshi
నామినేషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న విశాల్‌ జట్టు

మొదలైన నడిగర్‌ సంఘం ఎన్నికల నామినేషన్ల పర్వం 

సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఎన్నికల నగారా ఇప్పటికే మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పద్మనాభన్‌ నేతృత్వం వహిస్తున్నారు. 2015లో నటుడు శరత్‌కుమార్, రాధారవిల జట్టును ఢీకొని గెలిచిన విశాల్, నాజర్, కార్తీల పాండవర్‌ జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది.

మహాజట్టు ప్రయత్నం
గత ఎన్నికల్లో విశాల్‌ జట్టు విజయం కోసం కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. వారంతా కలిసి ఈ సారి విశాల్‌ జట్టును ముఖ్యంగా విశాల్‌ను ఓడించాలన్న కసిగా ఉన్నారు. దీంతో విశాల్‌ జట్టుకు వ్యతిరేకంగా మహా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా బిగ్‌షాట్‌ అయిన ఐసరి గణేశ్‌ను రంగంలోకి దింపారు. ఈయన విద్యా సంస్థల అధినేత, సినీ నిర్మాతగా తెలిసిందే. నటుడిగానూ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. విశేషం ఏంటంటే ఐసరిగణేశ్‌ కూడా గత ఎన్నికల్లో విశాల్‌ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన్నే ఢీకొనడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం. 

విశాల్‌ జట్టు..
విశాల్‌ జట్టులో నాజర్‌ అధ్యక్షుడిగానూ, విశాల్‌ కార్యదర్శిగానూ, కార్తీ కోశాధికారిగానూ, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పూచి మురుగన్‌ పోటీ చేస్తున్నారు. కార్యవర్గ సభ్యులుగా నటి కుష్భూ, కోవైసరళ, లతా సభాపతి, సోనియా, మనోబాలా, పశుపతి, ఎస్‌డీ.నందా, హేమచంద్రన్, రమణ, వాసుదేవన్, ఎస్‌ఎం.కాళిముత్తు, రత్నప్ప, జరాల్డ్, జూనియర్‌ బాలయ్య, రాజేశ్, దళపతి, దినేశ్, వెంకటేశ్, ఎంఎస్‌.ప్రకాశ్, సరవణన్‌ మొదలగు 19 మంది పోటీలో ఉన్నారు. 

గణేశ్‌ జట్టు..
వీరికి వ్యతిరేకంగా గణేశ్‌ జట్టులో అధ్యక్ష పదవికి దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ను బరిలోకి దించారు. కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్‌ పోటీ చేస్తున్నారు. నటి కుట్టి పద్మిని, నటుడు ఉదయ ఉపాధ్యక్ష పదవులకు, కోశాధికారి పదవికి జయంరవి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే ఈ జట్టు వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉండడంతో పోటీ వర్గాలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకున్న డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్‌ను నటుడు విశాల్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినంధించారు. దీంతో ఇటీవల ఆయనకు పోటీగా నటుడు ఉదయ కూడా స్టాలిన్‌ని కలిశారు. నడిగర్‌సంఘం రాజకీయ రంగు పులుముకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. 

కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్‌ జట్టు 
​​​​​​​

విశాల్‌ జట్టు దూకుడు
గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి రసవత్తరంగా జరగనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచే ప్రారంభం కావడంతో విశాల్‌ జట్టు ముందుగానే తన సభ్యుల పట్టికను ప్రకటించడంతో పాటు శనివారం నామినేషన్‌ కూడా దాఖలు చేసి దూకుడుని ప్రదర్శించారు.

భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం పాండవర్‌ జట్టు మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ నడిగర్‌ సంఘ నూతన భవన నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి ప్రయత్నాలను తాము సాగనివ్వమని అన్నారు. మరో 4 లేదా 6 నెలల్లో సంఘ భవన నిర్మాణం పూర్తి అయ్యే స్థాయిలో ఉన్నాయని, వాటిని కచ్చితంగా పూర్తి చేసి తీరతామన్నారు. తమ కార్యవర్గం గత ఎన్నికల్లో చేసి వాగ్ధానాలన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్రాంత సభ్యులకు పెన్షన్‌ను పెంచడం లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చాయన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, అలాంటివి తనకు కొత్త కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. అదే విధంగా నడిగర్‌ సంఘం రాజకీయాలకు అతీతం అన్నారు. ఇందులో ఉన్న వారెవరూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదన్నారు. త్వరలో నిర్వహించనున్న సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నట్లు విశాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు