కమల్‌ కోసం ప్రచారానికి రెడీ!

5 Aug, 2018 08:28 IST|Sakshi

కమలహాసన్‌ కోసం ఆయన మక్కళ్‌ నీది మయ్యం పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెడీ అంటున్నారు నటి పూజాకుమార్‌. విశ్వనటుడు కమలహాసన్‌తో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన కథానాయకి పూజాకుమార్‌. అయితే 2000 సంవత్సరంలోనే కడల్‌ పూజావే చిత్రంతో కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కేరాఫ్‌ అమెరికా. అవును యూఎస్‌ఏకు చెందిన పూజాకుమార్‌ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. అదే విధంగా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేశారు. కమలహాసన్‌తో విశ్వరూపం పార్టు 1, 2ల్లో నటించారు. తెలుగులో రాజశేఖర్‌కు జంటగా నటించిన గరుడవేగ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈనటి పూజాకుమార్‌ సాక్షితో ముచ్చటించారు . ఆ వివరాలు చూద్దాం.

కమలహాసన్‌తో వరుసగా మూడు చిత్రాల్లో నటించారు. ఆ అనుభవాలను చెప్పండి?
కమలహాసన్‌ ఎంత గొప్ప నటుడని మాటల్లో చెప్పలేం. సినిమా గురించి ఆయనకు తెలియని విషయం ఉండదంటే అతిశయోక్తి కాదు.అలాంటి నటుడితో నటించడం నిజంగా గొప్ప అనుభవమే. కమల్‌తో నటించిన ప్రతి నిమిషం మధురమైన అనుభూతే.

విశ్వరూపం–2 త్వరలో తెరపైకి రానుంది. ఆ చిత్రం గురించి?
ఇంతకు ముందు తెరపైకి వచ్చిన విశ్వరూపం చిత్రం ఘన విజయాన్ని సాధించింది. విశ్వరూపం–2 అంతకంటే పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. అంతర్జాతీయ సాంకేతిక విలువలతో కూడిన చిత్రం విశ్వరూపం 2. మొదటి భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తే, రెండవ భాగాన్ని పూర్తిగా భారతదేశంలోనే చిత్రీకరించడం విశేషం.

ఒకే చిత్రంలో ఐదేళ్ల పాటు నటించడం బోర్‌ కొట్టలేదా?
పాత్రల్లో సత్తా ఉంటే ఎన్ని ఏళ్లు నటించినా బోర్‌ కొట్టదు. అలాంటి పాత్రనే విశ్వరూపం 1, 2 చిత్రాల్లో నేను చేశాను.

ఈ చిత్రంలో స్కూబా డైవ్‌ లాంటి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించారట?
అవును. ఆ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. బేసిగ్గా నేను స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందాను. కాబట్టి ఆ సన్నివేశాల్లో నటించడం ఏమంత కష్టం అనిపించలేదు.

వరుసగా కమలహాసన్‌తోనే నటిస్తున్నారు. ఇతర నటులతో నటించరా?
అలాంటిదేమీలేదు. కమలహాసన్‌తో నటించే అవకావాలు వరుసగా రావడంతో మీరు అలా అంటున్నారు. ఇంతకు ముందు ప్రభుకు జంటగా మీన్‌కుళంబుమ్‌ మణ పాళైయమ్‌ చిత్రంలో నటించాను. అదే విధంగా తెలుగులో రాజశేఖర్‌ సరసన గరుడవేగ చిత్రంలో నటించాను.

ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటించడం లేదే?
నేను నివసించేది అమెరికాలో. సో ఆ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కూడా ఒక కారణం కావచ్చు. అదే విధంగా బాలీవుడ్, హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించడంతో దక్షిణాది చిత్రాలకు గ్యాప్‌ వస్తోంది.

తెలుగులో మళ్లీ నటించే అవకాశం ఉందా?
ఖచ్చితంగా. ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

చిత్ర నిర్మాతగా మారే ఆలోచన ఉందా?
ఉంది. తమిళం, తెలుగు భాషలతో పాటు ఆంతర్జాతీయ స్థాయిలో చిత్రం చేసే ఆలోచన ఉంది.

కమలహాసన్‌ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాజకీయ జీవితం గురించి మీ కామెంట్‌?
కమలహాసన్‌ గొప్ప నటుడే కాదు. అన్ని విధాలుగా పరిణతి చెందిన వ్యక్తి. ప్రజా సమస్యల గురించి తెలిసిన వ్యక్తి కూడా. ప్రజలపై ప్రేమాభిమానాలు ఉన్న వారు విజయ సాధించడం అసాధ్యం కాదు. అయితే నేను అమెరికాకు చెందిన వ్యక్తిని అక్కడి రాజకీయాల గురించి తెలుగు గానీ, ఇండియన్‌ రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు.

కమలహాసన్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా?
కమలహాసన్‌ కోసం ఆయన పార్టీ తరపున ప్రచారం చేయడానికి నేను రెడీ. అయితే అందుకు ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది.

మరిన్ని వార్తలు