మగవాళ్లను కూడా పడక గదికి రమ్మంటున్నారు

13 Mar, 2018 10:27 IST|Sakshi
వివేక్‌ అగ్నిహోత్రి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : దర్శక నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి(హేట్‌స్టోరీ ఫేమ్‌) వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో మహిళలపై మాత్రమే కాదని.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. తన బంధువుల అబ్బాయి ఒకరు అమెరికా నుంచి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు వచ్చాడని.. అతన్ని ఓ స్టార్‌ హీరో, దర్శకనిర్మాతకు పరిచయం చేశానని... అయితే వారు అతన్ని లైంగికంగా వేధించారని ఆయన ట్వీట్‌ చేశారు. దీనిపై ఓ మీడియా ఛానెల్‌ ఆయన్ని సంప్రదించగా ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాలీవుడ్‌లో హర్వే వెయిస్టెన్‌లను వెతికి తీస్తే అగ్ర హీరోలు, డైరెక్టర్‌లు బయటపడతారు. నా బందువు అలాంటి వాళ్ల చేతిలో నలిగిపోయిన బాధితులే. వారికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఎవరికీ లేదు. అందుకు బోలెడంత మంది కంగనా రనౌత్‌లు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుంది’ అని వివేక్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో రాజకీయాలు మూడు రకాలుగా సాగుతున్నాయని.. లైంగికంగా, డబ్బు, అధికారం ఇలాంటి మూడింటితో అవకాశాల కోసం వచ్చేవారిని వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ‘అవకాశాల కోసం పడకగదికి రమ్మంటున్నారు. లేదా డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు. ఇవేం కుదరకపోతే ఊడిగం చేయించుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కొందరు వారికి లొంగిపోతున్నారు’ అని వివేక్‌ వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమం కేవలం మహిళలకు మాత్రమే సొంతం కాకూడదని.. మగవాళ్లు కూడా ఇండస్ట్రీలో జరిగే ఆరాచకాలను బయటపెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుతుందని వివేక్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు