భారతీయుడిగా అది నా బాధ్యత

24 Aug, 2019 05:41 IST|Sakshi
వివేక్‌ ఒబెరాయ్‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగిన బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్స్‌ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్‌ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్‌గా అభినందన్‌ తిరిగి భారత్‌కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌.

‘‘బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్‌ లీడర్స్‌ గురించి హాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ గొప్పగా చెప్పుకుంటారు.

మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్‌. ఈ చిత్రానికి ‘బాలాకోట్‌: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్‌ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు