వర్చువల్‌ రియాల్టీలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌!

25 Mar, 2017 23:36 IST|Sakshi
వర్చువల్‌ రియాల్టీలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌!

ట్రెయిలర్‌తోనే రికార్డులు సృష్టించిన మెగా మూవీ ‘బాహుబలి–2’ మరో సంచలనానికి తెరతీస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను వర్చువల్‌ రియాల్టీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఈ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

 ‘బాహుబలి–2’ నిర్మాణ సమయంలో ఈ సంస్థ రెండు వర్చువల్‌ రియాల్టీ బిట్లను అభివృద్ధి చేసింది. ‘బీబీ360సీసీ’ పేరుతో అభివృద్ధి చేసిన 32 కెమెరాలున్న సూపర్‌ వీఆర్‌ క్యాప్చరింగ్‌ కెమేరాతో వీటిని చిత్రీకరించింది. ఈ 32 కెమేరాల్లోని దృశ్యాలను సీన్‌గా మార్చేందుకు లూమ్‌ పేరుతో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఒకదాన్ని తయారు చేశారు. ఒకవైపు షూటింగ్‌ జరుగుతూండగానే.. మరోవైపు ఈ సాఫ్ట్‌వేర్‌ వర్చువల్‌ రియాల్టీ సీన్స్‌ను సిద్ధం చేస్తూంటుంది. ఇలా చిత్రీకరించిన సీన్స్‌ను వీఆర్‌ హెడ్‌సెట్‌తో చూసినప్పుడు.. ప్రేక్షకుడికి తాను సన్నివేశం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్‌ చేసే యుద్ధ విన్యాసాలు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (జీపీయూ), బీబీ360సీసీ కెమేరా, లూమ్‌ సాఫ్ట్‌వేర్‌లను కలిపి ఉపయోగించడం ద్వారా అత్యద్భుతమైన నాణ్యతతో వర్చువల్‌ రియాల్టీ సన్నివేశాలను సిద్ధం చేయవచ్చునని ఏఎండీ అంటోంది. పైగా.. లూమ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిలో అభివృద్ధి చేసినందున.. దీన్ని ఎవరైనా వాడుకునే వీలుంటుందని సంస్థ ఉన్నతాధికారి రాజా కోడూరి తెలిపారు.

‘బాహుబలి’ కోసం తాము వీఆర్‌లో రెండు సీన్స్‌ సిద్ధం చేశామని, దీంట్లో ఒకటి బాహుబలి సెట్స్‌కు సంబంధించినది కాగా, రెండోది ‘ది స్వోర్డ్‌ ఆఫ్‌ బాహుబలి’ అని ఆయన చెప్పారు. బాహుబలి సెట్స్‌ తాలూకు వీఆర్‌ క్లిప్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రత్యేకమైన పాడ్స్‌లలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించనున్నారు.