ఇక నటనకు వీడ్కోలు!

6 Apr, 2014 23:37 IST|Sakshi
ఇక నటనకు వీడ్కోలు!
అందం, అభినయానికి చిరునామా అనిపించుకున్నారు వహీదా రెహ్మాన్. ఒకప్పుడు నాయికగా ఆమె ఓ స్థాయిలో రాణించారు. జయసింహా, రోజులు మారాయి, బంగారు కలలు తదితర తెలుగు చిత్రాల్లో నటించిన వహీదా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్‌కి పరిమితమయ్యారు. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో..’ పాటలో ఆమె అభినయం సులువుగా మర్చిపోలేరు. ఇక, త్వరలో విడుదల కానున్న కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’లో అతిథి పాత్ర చేశారామె. నటిగా వహీదాకి ఇదే చివరి సినిమా అవుతుందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న వహీదా మాట్లాడుతూ - ‘‘1950 నుంచి నటిస్తూనే ఉన్నా. 
 
ఇంకెంత కాలం చేయమంటారు? కథానాయికగా, తల్లిగా, అమ్మమ్మగా.. ఇలా పలు పాత్రలు చేశాను. నాలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లు యాక్ట్ చేస్తారు. ఇక నేను సినిమాలకు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నా. ‘విశ్వరూపం 2’లో చేశాను. కమల్‌హాసన్ చాలా ప్రతిభ గలవాడు’’ అన్నారు. పాత రోజులు గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో తను సినిమాల్లోకొచ్చినప్పుడు, పేరు మార్చుకోమని ఒత్తిడి చేశారని, తన తల్లీతండ్రీ ఇచ్చిన పేరుని మార్చుకోనని కరాఖండిగా చెప్పేశానని వహీదా పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ స్లీవ్‌లెస్ బ్లౌజు వేసుకోలేదని, ఇక బికినీ వేసుకోమన్నా వేసుకో నని తెలిసి ఎవరూ అడగలేదని వహీదా తెలిపారు. ఇటీవలే ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో ‘కాన్వర్‌జేషన్స్ విత్ వహీదా’ అనే పుస్తకం విడుదలైంది. ఆ  పుస్తకం బాలీవుడ్‌లో సంచలనమైంది.