టాలీవుడ్‌లో ఓరుగల్లు దర్శకుల హవా

15 Feb, 2020 09:15 IST|Sakshi

‘పెళ్లి చూపులు’ అంటూ సైలెంట్‌గా వచ్చి వైలెంట్‌ హిట్‌తో తన సత్తా చాటాడు తరుణభాస్కర్‌. ‘అర్జున్‌ రెడ్డి’ అంటూ సందీప్‌ రెడ్డి వంగా తెలుగు సినీ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయగా.. చదువు, భవిష్యత్‌ అంశాన్ని ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ వేణు ఊడుగుల అద్భుతంగా చర్చించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘దొరసాని’వే అంటూ కేవీఆర్‌ మహేంద్ర వెంటాడి విజయతీరాలకు చేరాడు.!! వీరందరూ తొలి సినిమాతోనే హిట్‌ సొంతం చేసుకున్నారు. కథపై క్లారిటీ, వినూత్న స్క్రీన్‌ ప్లే, మాటల మాయాజాలం, బిగువైన సన్నివేశాలు, భావోద్వేగాలు, రచనా శైలియే వీరి విజయానికి చిరునామా.!

సాక్షి, వరంగల్‌ రూరల్‌: తెలుగు సినీ పరిశ్రమలో ఓరుగల్లు యువ దర్శకులు సత్తా చాటుతున్నారు. మెగాఫోన్‌ పట్టి స్టార్‌ నటులకు స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ అంటూ ఆదేశాలిస్తున్నారు.! ప్రత్యేక రాష్ట్ర సాకారం తర్వాత సినీ రంగంలో మార్పు కనిపిస్తోంది. ఉద్యమగడ్డ.. అడ్డా అయిన వరంగల్‌కు చెందిన పలువురు వినోదాత్మతకమైన ఊహా ప్రపంచంలో తమదైన మార్క్‌ను పద్రర్శిస్తున్నారు.

సందీప్‌ రెడ్డి వంగా
‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. విజయ్‌ దేవరకొండకు స్టార్‌ ఇమేజ్‌ ఇచ్చిన సినిమా ఇది. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి అర్జున్‌రెడ్డిని షాహీద్‌కపూర్‌తో ‘కబీర్‌ సింగ్‌’గా తీసి అక్కడ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్‌తో సత్తా చాటి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫలితంగా బాలీవుడ్‌ సందీప్‌పై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మర్రి వెంకటయ్య కాలనీకు చెందిన వారు సందీప్‌ రెడ్డి.

కేవీఆర్‌ మహేంద్ర..
కొద్దిరోజుల క్రితం విడుదలయిన ‘దొరసాని’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కేవీఆర్‌ మహేంద్ర. హసన్‌పర్తికి చెందిన ఈ యువ దర్శకుడు ‘నిశీధి’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీసి పలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. అనంతరం ‘ఒగ్గుచుక్క’ అనే డాక్యుమెంటరీని తీశాడు. పలు యాడ్స్‌కు దర్శకత్వం వహించాడు. తాజాగా విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లతో తెరకెక్కించిన ‘దొరసాని’ సినిమాతో విజయభేరి మోగించాడు.

వేణు ఊడుగుల
వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట ఉప్పరపల్లిలో వేణు ఊడుగుల జన్మించాడు. ఉప్పరపల్లిలో పాఠశాల విద్య, డిగ్రీ హన్మకొండలో డిగ్రీ మూడో సంవత్పరం చదువుతున్న దశలోనే పరిశ్రమవైపు అడుగులు వేశాడు. రచయిత, దర్శకుడు మదన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, వేటూరి సుందరరామమూర్తి వద్ద 2008లో సహాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. వేణు మంచి భావుకత వున్న కవి కూడా. వేణు కవితలు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు మాటల రచయితగా తనముద్ర వేశాడు. అనంతరం ‘నీదీ నాదీ ఒకేకథ’ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు. చదువు, భవిష్యత్‌ వంటి సున్నితమైన అంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ అంశాన్ని వేణు సరికొత్తగా తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన రెండో సినిమా రానా, సాయిపల్లవితో ‘విరాటపర్వం’ను తెరకెక్కిస్తున్నాడు.

తరుణ్‌ భాస్కర్‌..
హన్మకొండ వడ్డేపల్లి నుంచి వచ్చిన తరుణ్‌ తొలుత ‘సైన్మా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. అనంతరం ‘పెళ్లిచూపులు’ సినిమా తీసి సినిమా ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా మంచి బోణీ ఇచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత తరుణ్‌ ‘ఈ నగరానికి ఏమైంది’ దర్శకత్వం వహించాడు. అనంతరం నటుడిగా కూడా రాణిస్తున్నాడు. మీకుమాత్రమే చెప్తా, మహానటి, ఫలక్‌నుమాదాస్‌ సినిమాల్లో నటుడిగా తనలోని మరో కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ హీరోగా రాణించేందుకు తరుణ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరికొన్ని సినిమాలకు స్టోరీలను రాస్తున్నాడు.

కొత్త ఒరవడి
తెలుగు పరిశ్రమలో స్వరాష్ట్ర సాధన అనంతరం మార్పు కనిపిస్తోంది. వరంగల్‌ నుంచి చాలామంది ప్రతిభ ఉన్న టెక్నీషియన్లు సినిమా రంగానికి పరిచయమవుతున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు.. ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. బాలీవుడ్‌లో తెర మీద మరాఠీ సినిమాలు తమ ఉనికిని చాటుకుంటున్నట్టే ఇప్పుడు తెలుగు సినీరంగంలో తెలంగాణ టెక్నీషియన్స్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దర్శకులు ఎక్కువగా వస్తున్నారు.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా