లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!

11 Jan, 2016 19:45 IST|Sakshi
లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసు మీద పడుతున్నా.. కలెక్షన్ల సత్తా తనలో తగ్గలేదని అంటున్నారు. అందుకు నిదర్శనం.. ఆయన తాజాగా నటించిన వజీర్ చిత్రం. బిజయ్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ డ్రామా కేవలం మొదటి మూడు రోజుల్లోనే రూ. 21 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన వజీర్ సినిమాకు ఆరోజు రూ. 5.61 కోట్ల వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో మాత్రం ఇది దుమ్ము దులిపింది.

ఆ రెండు రోజుల్లో వరుసగా రూ. 7.16 కోట్లు, 8.24 కోట్ల వసూళ్లు వచ్చాయని, దాంతో స్వదేశంలో వీకెండ్ కలెక్షన్లు రూ. 21.01 కోట్లుగా నిలిచాయని సినిమా వర్గాలు తెలిపాయి. ఇది కాక.. ఓవర్సీస్ కలెక్షన్లు మరో రూ. 10.48 కోట్లు వచ్చాయి. ఆ లెక్కన అక్కడ, ఇక్కడ కలిపితే 31.49 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న మాట. విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఫర్హాన్ అఖ్తర్, నీల్ నితిన్ ముఖేష్, అదితి రావు, జాన్ అబ్రహం తదితరులు నటించారు.