థర్డ్‌ అంపైర్‌

5 Jan, 2019 00:32 IST|Sakshi

వెబ్‌ఫ్లిక్స్‌

బంతి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో వస్తుంది. తెలియకముందే, తెలుసుకునే ముందే సమయాన్ని ఓడగొడుతూ సెకన్‌ల ముల్లు కింది నుంచి జారుకుంటూ వెళ్లిపోతుంది.  బంతి ఏం చేసింది, బంతి కొట్టాల్సిన ఆటగాడు ఏం చేశాడూ..కచ్చితంగా తెలియాలి.  అందుకే క్రికెట్‌లో థర్డ్‌ అంపైర్‌ని ఆశ్రయిస్తారు.  బంతి వేగాన్ని పది రెట్లు తగ్గించి ఏం జరిగిందీ తెలుసుకుంటారు. జీవితమూ అంతే. ఆ బంతి కంటే వేగంగా ఆవేశాలు, ఉద్వేగాలు జారిపోతాయి.. చొచ్చుకుపోతాయి. మానవ సంబంధాలను అర్థం చేసుకోడానికి కూడా భావావేశాలను పదిరెట్లు తగ్గించి చూసి, అర్థం చేసుకునే థర్డ్‌ అంపైర్‌ అవసరం. అలాంటి కథే..  ‘సెలక్షన్‌ డే’. ఈవారం మన స్పెషల్‌.

మన దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘ఫ్లూ’స్‌ రెండే రెండు. సినిమా, క్రికెట్‌! మైదానంలోనే కాకుండా నిన్నటి వరకు క్రికెట్‌.. బయోగ్రఫీస్‌ క్రీజ్‌లో ఉంది. ఇప్పుడు వెబ్‌సిరీస్‌ పిచ్‌లోనూ బ్యాటింగ్‌ చేస్తోంది. వాటికి సబ్జెక్ట్‌ అవుతూ! అలాంటిదే ‘సెలక్షన్‌ డే’. నెట్‌ఫ్లిక్స్‌ థర్డ్‌ ఒరిజినల్‌. ఈ మధ్యే అప్‌లోడ్‌ అయింది. వెబ్‌సిరీస్‌గా స్ట్రీమ్‌ కాకముందు సెలక్షన్‌ డే ఒక నవల. అదే పేరుతో దీన్ని అరవింద్‌ అడిగ రాశాడు.  మన దగ్గర యూత్‌కు చాలా వరకు రెండే కలలుంటాయి.  సినిమాల్లోకి (హీరో, హీరోయిన్, సింగర్, డైరెక్టర్‌ ఎట్‌సెట్రా) రావాలని, క్రికెటర్‌ కావాలని.  మెడిసిన్, ఇంజనీరింగ్‌ కాకుండా పిల్లల విషయంలో కాస్త భిన్నంగా ఆలోచించే తల్లిదండ్రులూ తమ పిల్లలను క్రికెటర్స్‌నే చేయాలనుకుంటారు. అలాంటి తండ్రే మోహన్‌ కుమార్‌ (రాజేశ్‌ తెలంగ్‌). తన ఇద్దరు కొడుకులకు సంబంధించి ఆ నాన్న  లక్ష్యమే సెలక్షన్‌ డే!

చాంపియన్‌ నం.1, చాంపియన్‌ నెం.2
మధ్యప్రదేశ్‌లోని బండోనా ఊళ్లో కథ మొదలవుతుంది. మోహన్‌ కుమార్‌ అక్కడే ఉంటాడు కాబట్టి. అతను కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ హాకీ ప్లేయర్‌ను పెళ్లి చేసుకుంటాడు. అథ్లెట్స్‌కి తండ్రి కావాలనే కోరికతో మాత్రమే. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. రాధాకుమార్, మంజునాథ్‌. పదహారు, పదిహేనేళ్లుంటాయి. ఉగ్గు పాలతో క్రికెట్‌ను పట్టి పెంచుతాడు పిల్లల్ని. వాళ్లకు ఇల్లే స్కూలు. తండ్రే గురువు. క్రికెట్‌ తప్ప ఇంకే లోకం లేకుండా చేస్తాడు. కోచింగ్‌ మెథడ్సన్నిటినీ ఔపోసన  పట్టి ఒక ప్రత్యేక శిక్షణా పద్ధతిని తయారు చేస్తాడు. వాళ్లకు కోచ్, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్‌ అన్నీ తనే! పిల్లలను వరల్డ్‌ నంబర్‌ వన్‌ చాంపియన్, నంబర్‌ టూ చాంపియన్‌ చేయాలనే తపన, ఆరాటం, ధ్యేయం. పిల్లల్ని అలానే పిలిచుకుంటుంటాడు. ఎవరిమాటా వినడు. అతను  చెప్పిందే వినాలి. తనకు అన్నీ తెలుసనే అహంతో ఉంటాడు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి. ఈ విషయంలోనే భార్యతో తగాదా పడి ఆమె మీద చేయి కూడా చేసుకుంటాడు. ఆమె ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అయితే ఇదంతా కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగా అవగతమవుతుంది తప్ప పిల్లల తల్లి తొమ్మిది ఎపిసోడ్ల ఈ కథనంలో ఎక్కడా కనిపించదు.  

అన్నకు తమ్ముడు బలం.. తమ్ముడి స్ట్రెంత్‌ సైన్స్‌
ముంబై వెళ్లి అక్కడ మంచి క్రికెట్‌ క్లబ్‌లో పిల్లలను చేర్పించాలని అనుకుంటాడు మోహన్‌ కుమార్‌. వాళ్ల ఆట తీరును ఇంకా మెరుగు పరిచి, అండర్‌ 16– ముంబై టీమ్‌కి ఆడించాలని ప్లాన్‌ చేస్తాడు. ముంబై ప్రయాణానికి సిద్ధ పడ్తాడు కొడుకులతో కలిసి. తండ్రితో రాధాకుమార్‌కు ఏ సమస్యా ఉండదు. చిక్కంతా చిన్నోడైన మంజూకే. వాడికి అమ్మంటే ప్రాణం. ముంబై బయలుదేరే ముందు రోజు క్రికెట్‌ ఆడి ఇంటికొచ్చే సరికి తల్లి కనపడదు. డైనింగ్‌ టేబుల్‌ కింద పగిలిన గాజు ముక్కలు, మంచం దగ్గర పడిపోయిన రబ్బర్‌బ్యాండ్, కుర్చీకి అంటుకున్న రక్తం మరకలు కనపడ్తాయి. అమ్మేది అని అడుగుతాడు. హుబ్లీ వెళ్లింది  అంటాడు తండ్రి.  మనసు మనసులో ఉండదు మంజూకి. రాత్రి నిద్రపోడు. ఏమీ పట్టనట్టు హాయిగా పడుకున్న అన్నను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే రాధా ఇవేవీ పట్టించుకోడు. వాడికి క్రికెట్‌ అంటే పిచ్చి. దాన్నే శ్వాసిస్తుంటాడు. తండ్రి మాట జవదాటడు. మంజు అలా కాదు. క్రికెట్‌ కన్నా ఇంజనీరింగ్‌ సైన్స్‌ అంటే ఇష్టం. సైంటిస్ట్‌ అవ్వాలనే ఆశయం. ఈ ఇద్దరు అన్నదమ్ములను ఓపెనర్స్‌గా ట్రైన్‌ చేస్తాడు తండ్రి. జతగా తమ్ముడు లేకపోతే తడబడ్తాడు అన్న.  తమ్ముడు అలా కాదు. మొత్తానికి ముంబై వెళ్తారు. 

ముంబై గ్రౌండ్‌
ముంబైలో  పైసా, ప్రాపకం రెండూ ఉంటేనే జీవితం.  కేవలం క్రికెట్‌ కిట్‌లతో కాలు పెట్టిన ఆ ముగ్గురూ ఆ సిటీ లైఫ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టలేక డిఫెన్స్‌కే పరిమితమవుతారు. అతికష్టమ్మీద ఉండటానికి ఓ కోలీ (గది) సంపాదిస్తారు. ఎక్కే మెట్టు, గెంటేసే సెక్యూరిటిలా ముంబైలోని పేరెన్నికగన్న క్రికెట్‌ క్లబ్‌లన్నీ తిరుగుతారు కోచింగ్‌ కోసం. ప్రవేశం దొరకదు. ఒకరోజు ఒక గ్రౌండ్‌లో సెలక్షన్స్‌ జరుగుతుంటే అందులో జొరబడ్తారు ముగ్గురూ. ఒక్క చాన్స్‌ ఇవ్వమని కోరుతూ ఇద్దరు కొడుకులతో బ్యాటింగ్‌ చేయిస్తాడు మోహన్‌.  చిరాకుపడ్డ సెలక్షన్‌ కమిటీ వాళ్లను తరిమేస్తుంది. ఆ పిల్లల బ్యాటింగ్‌చూసి అబ్బురపడ్తాడు ఇండియన్‌ టీమ్‌ మాజీ కోచ్‌ నారాయణ్‌ సదాశివ్‌ కులకర్ణి ఉరఫ్‌ టామీ సర్‌ (మహేశ్‌ మంజ్రేకర్‌). వాళ్లకు తను కోచింగ్‌ ఇస్తానని విఇన్‌బర్గ్‌ అనే మంచి స్కూల్‌లో అడ్మిషనూ ఇప్పిస్తానని మోహన్‌ కుమార్‌తో చెప్తాడు. అప్పటిదాకా క్రికెట్‌ క్లబ్స్‌లో ఎంట్రీ కోసం ప్రయత్నించి విసిగిపోయి ఉండటం వల్ల, స్కూల్‌ అనగానే పిల్లల్లో కనపడిన ఉత్సాహంతో ఓకే అంటాడు. కాని పిల్లలను హెచ్చరిస్తుంటాడు ఎవరిమాటా వినొద్దు అంటూ!  

స్పోర్ట్స్‌ అండ్‌ క్రియేటివిటీనే కరిక్యులమ్‌ 
బట్టీ పట్టే పని లేని ఆ స్కూల్‌ కుమార్‌ బ్రదర్స్‌కి చాలా నచ్చుతుంది. ఆటలు, సృజనే కరిక్యులమ్‌గా ఉన్న ఆ వాతావరణంలో గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాన్న దగ్గరి కంటే సంతోషంగా ఉంటారు  వాళ్లు ఆ స్కూల్లో. అన్నదమ్ములిద్దరూ ఒకరిమీద ఒకరు ఆధారపడేట్టున్న వాళ్ల ఆటతీరును ఇట్టే పసిగట్టేస్తాడు కోచ్‌ టామీ సర్‌. టీమ్‌ స్పిరిట్‌ నేర్పుతుంటాడు. వ్యక్తిగత సామర్థ్యాన్ని వెలికితీస్తుంటాడు.ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ నెల్లి విఇన్‌బర్గ్‌(రత్న పాఠక్‌ షా) మంచి మ్యాథమెటీషియన్‌. ఆమె భర్త విఇన్‌బర్గ్‌ ఒకప్పుడు గ్రేట్‌ క్రికెటర్‌. అతను స్థాపించిందే ఆ స్కూల్‌. విన్‌బర్గ్, టామీ మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే విన్‌బర్గ్‌ చనిపోయినా ఆ స్కూల్లో కోచ్‌లా చేరుతాడు టామీ.  మంజూకి మ్యాథ్స్, సైన్స్‌ అంటే ఉన్న  జిజ్ఞాస చూసి ప్రోత్సహిస్తుంటుంది నెల్లి విఇన్‌బర్గ్‌.  క్రమంగా క్రికెట్‌కు దూరమవుతుంటాడు మంజు. సైన్స్‌ఫేర్‌ కోసం తన బ్యాచ్‌మేట్స్‌తో కలిసి ఓ సైకిల్‌ను తయారు చేస్తుంటాడు. రన్స్‌ చేయందే నిద్రపోనివ్వని తండ్రి ప్రతిరోజూ స్కూల్‌ నుంచి రాగానే స్కోర్‌ అడుగుతుంటాడు పిల్లలను. బ్యాటింగ్‌ చేయకుండా తెలుసుకున్న  కొత్త విషయాలను చెప్తుంటే అతనికి కోపమెస్తుంది. టామీ వాళ్లను చెడగొడ్తున్నాడని, విడదీసి బలహీనులను చేస్తున్నాడని ఆవేశపడి అతనితో గొడవకు వెళ్తాడు. తండ్రి ప్రవర్తన పిల్లలకు నచ్చదు. అయినా టామీ సర్‌ ఓపిగ్గా పిల్లలను చేరదీయడంతో ఆయన మీద వీళ్లకు గౌరవం రెట్టింపవుతుంది. ఆ స్కూల్లో వీళ్లిద్దరికీ ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతనే జావీద్‌. స్కూల్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌. అప్పటిదాకా ఉన్న రికార్డ్‌ను అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రేక్‌ చేస్తారు. వాళ్లంటే స్కూల్లో క్రేజ్‌ పెరుగుతుంది. ఇది జావీద్‌కు నచ్చదు. ఇంకోసారి మ్యాచ్‌లో రాధాతో ఓపెనర్‌గా జావీద్‌ వచ్చి కుమార్‌ బ్రదర్స్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసేంత దగ్గరగా వస్తాడు. మైండ్‌గేమ్‌ ఆడి జావీద్‌ను అడ్డుకుంటాడు   రాధా. ఆ మ్యాచ్‌లో రాధా తమ్ముడి తోడు లేకపోయినా మంచి స్కోర్‌ చేస్తాడు. ఆ వీడియో ముంబైలో వైరల్‌ అవుతుంది. అది ఓ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ మ్యాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఫోన్‌కీ చేరుతుంది. ఆ బిజినెస్‌ మ్యాన్‌ నెల్లీ విఇన్‌బర్గ్‌ స్కూల్‌ను కొనేసుకుని అక్కడ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టాలని ప్లాన్‌ చేస్తుంటాడు.బేరానికి వెళ్తాడు కూడా. విఇన్‌బర్గ్‌ ఒప్పుకోదు. ఈ స్థలం కావాలంటే ముందు ఆ స్కూల్లో చదువుతున్న ఈ అబ్బాయికి స్పాన్సర్‌షిప్‌ ఇవ్వు అని ఆ వీడియో చూపిస్తు్తంది గర్ల్‌ఫ్రెండ్‌. అతను మోహన్‌ కుమార్‌ను కలిసి ఒప్పందం చేసుకుంటాడు. ఆ సంగతి నెల్లీకీ చెప్పి.. రా«ధాకు ఇచ్చే స్పాన్సర్‌షిప్‌ మీద  వచ్చే ఆదాయంతో స్కూల్‌ని స్పోర్ట్స్‌ అకాడమీగా మార్చేందుకు పెట్టుబడిగా పెడ్తా,  భాగస్వామిగా చేర్చుకొమ్మని అడుగుతాడు. నమ్ముతుంది నెల్లీ.
 
చాంపియన్‌షిప్‌ కోసం అన్న.. అమ్మ కోసం తమ్ముడు
 తమ్ముడు క్రికెట్‌ను పట్టించుకోకుండా సైన్స్‌ఫేర్‌లో మునిగిపోవడం రాధకు నచ్చదు. తన పార్టనర్‌షిప్‌ లేక అన్న స్వార్థంతో తనను క్రికెట్‌లోకి లాగుతున్నాడని అన్నతో గొడవకు దిగుతాడు తమ్ముడు.‘‘మనకు క్రికెటే జీవితం మర్చిపోకు. ఆట మీద కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యి’’ అని తమ్ముడిని వార్న్‌చేసి జాగింగ్‌కు బయలుదేరుతాడు రాధా. అన్న ప్రవర్తన, అమ్మ మీద బెంగతో కలత పడ్డ మంజు.. ఎప్పుడో అన్న  ఇచ్చిన అమ్మ ఫోన్‌నంబర్‌కు రింగ్‌ చేస్తాడు. వాళ్ల పిన్ని ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. అమ్మ గురించి అడుగుతాడు. ఇక్కడికి రాలేదు అని చెప్తుంది వాళ్ల పిన్ని. మంజు  స్థాణువవుతాడు. జాగింగ్‌కి బయలుదేరిన రాధా మీదా దాడి చేస్తారు గుర్తు తెలియని యువకులు.  ఫస్ట్‌ సీజన్‌ ఇక్కడికి ఎండ్‌ అవుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ– తండ్రి పెత్తనం, పల్లెటూరు– నగర జీవనం, హిందీ – ఇంగ్లీష్, మర్యాద – అహంకారం, ఆట–యాంబిషన్, డిపెండెన్స్‌– ఇండిపెండెన్స్‌.. వీటన్నిటి సంఘర్షణే సెలక్షన్‌ డే. ఎండ్‌ అయిన తీరును చూస్తే త్వరలోనే సెకండ్‌ సీజన్‌ కూడా ప్రారంభంకాబోతుందేమో అనిపిస్తుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ నిర్మాత. ఉదయన్‌ ప్రసాద్‌ దర్శకుడు. 
– సరస్వతి రమ 

మరిన్ని వార్తలు