వివాదస్పద వెబ్‌ సిరీస్‌పై పోలీస్‌ కంప్లెంట్‌

10 Jul, 2018 20:51 IST|Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ మీడియా సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్‌ గేమ్స్‌’కు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రీమియర్‌ షో విడుదలైన ఐదు రోజుల్లోనే ‘సాక్రెడ్‌ గేమ్స్‌’పై పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు నమోదయ్యింది. రాజకీయాలతో పాటు ఎదిగిన నేర ప్రపంచం ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో మాజీ దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు.

వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త రాజీవ్‌ సిన్హా అనే వ్యక్తి ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో ‘గణేష్‌ గైతొండే’ పాత్రలో నటించిన నవాజుద్దీన్‌ సిద్దిఖీ మాజీ దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని దూషించారని.. ఆయన కాలంలో వచ్చిన ‘షాబానో కేస్‌’కు (ట్రిపుల్‌ తలాక్‌కు సంబంధించిన కేసు) సంబంధించిన వివరాలను వక్రీకరించారని కోల్‌కతా పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. విక్రమ్‌ చంద్రా రచించిన ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ పుస్తకాన్ని అదే పేరుతో వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు అనురాగ్‌ కశ్యప్‌, విక్రమాదిత్య మొత్వాని.

ఈ పుస్తకంలో విక్రమ్‌ చంద్రా స్వాతంత్యానంతరం దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు, వాటికి సమాంతరంగా ఎదిగిన అండర్‌ వరల్డ్‌ నేర ప్రపంచం వంటి పలు అంశాలను చర్చించారు. అనురాగ్‌ కశ్యప్‌, విక్రమాదిత్య మొత్వాని మొత్తం పుస్తకాన్ని 8 భాగాల వెబ్‌ సిరీస్‌గా తీసుకోస్తున్నారు. ఈ ఎనిమిది భాగాల్లో 1975లో ఇందిరా హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి.. అనంతరం రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారని సమాచారం.

ఇప్పటికే ఈ సాక్రెడ్‌ గేమ్స్‌ వెబ్‌ సిరీస్‌లో మితిమీరిన హింస, అశ్లీలతను చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు