వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ!

25 Jun, 2015 23:32 IST|Sakshi
వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ!

‘‘మరో పదేళ్ల తర్వాత నా కెరీర్‌ని విశ్లేషించుకుంటే, నేను గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ‘టైగర్’ తప్పకుండా ఉంటుంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. మంచి కథలు ఎంచుకుని, చక్కని పాత్రలు చేసే హీరోగా సందీప్‌కి గుడ్ ఇమేజ్ ఉంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘టైగర్’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్‌తో చిట్ చాట్.
 
 ***     ‘టైగర్’ అంటున్నారు.. పది మందిని రఫ్ఫాడించే పాత్ర చేసి ఉంటారేమో?
 లేదు. ఓ రెండు ఫైట్స్ ఉన్నాయి. హీరోయిజమ్‌ని ఎలివేట్ చేయడం కోసం పెట్టిన ఫైట్స్ కావవి. ‘ఇప్పుడు వీడు వాళ్లని కొడితే ఎంత బాగుండు’ అని ప్రేక్షకులు ఓ ఎమోషన్‌కి గురయ్యే టైమ్‌లో నేను ప్రత్యర్థులను కొడతాను. ఆ ఫైట్స్ బీభత్సంగా కూడా ఉండవు.
 
 ***     ఇంతకీ ‘టైగర్’ కథ ఏంటి?
 ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కథతో తమిళంలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో మురుగదాస్‌గారు నాతో సినిమా తీయాలనుకున్నారు. కానీ, ఆలస్యం అవుతుండటంతో ఆనంద్ వేరే సినిమా చేద్దామనుకున్నారు. ఇలాంటి కథ వదులుకుంటే మళ్లీ దొరకదని నిర్మాత ‘ఠాగూర్’ మధుని సంప్రతించాను. మధు, మురుగదాస్ మంచి ఫ్రెండ్స్. తెలుగులో చేస్తానని మధు అనగానే, మురుగదాస్ ఓకే అన్నారు. ఇది చాలా క్లిష్టమైన కథ. ఈ కథను తెరకెక్కించడం అంత సులువు కాదు. ఇంత రిస్కీ కథను ఆనంద్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇది మంచి యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసే సినిమా. నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నం.
 
 ***     టైటిల్ జస్టిఫికేషన్?
 ‘టైగర్’ అని ఎందుకు టైటిల్ పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమా నా నమ్మకానికో పరీక్షలాంటిది. ‘గ్యారంటీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అనే బలమైన నమ్మకంతో చేశాను. ఈ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతానని నమ్ముతున్నాను.
 
 ***     అది సరే.... నిజజీవితంలో టైగర్‌ని దగ్గరగా చూడటం కానీ, ఫొటో దిగడం కానీ చేశారా?
 (నవ్వుతూ). అంత సాహసం చేయలేదండీ. కాకపోతే, నా స్నేహితుల్లో చాలామంది పులిలాంటివాళ్లే. వాళ్లతో ఫొటోలు దిగాను. నాకు చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటాను. ఎందుకంటే, స్నేహం విలువ నాకు బాగా తెలుసు.
 
 ***     ఈ చిత్రంలో మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచే కనిపిస్తారనే టాక్ ఉంది?
 ముందు అలానే అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మారింది. 21వ నిమిషం నుంచి కనిపిస్తాను. ఇందులో నాకు హీరోయిన్ లేదు. మూడు పాటల్లో నటించాను కానీ, అవి డ్యూయెట్స్ కాదు. సినిమాలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ఉండదు. కథలో భాగంగానే కామెడీ ఉంటుంది. మొత్తం మీద ఓ ఫ్రెష్ మూవీ చూసిన ఫీల్ కలగడం ఖాయం.
 
 ***     సినిమా నిడివి కూడా తక్కువ అట?
 అవును. 1 గంట 58 నిమిషాలు మాత్రమే. ఓ కమర్షియల్ మూవీకి ఉండే పారామీటర్స్‌ని బ్రేక్ చేస్తూ, చేసిన కమర్షియల్ సినిమా ఇది.
 
 ***     మీ తదుపరి చిత్రం?
 ఓ తమిళ సినిమా చేస్తున్నాను. తెలుగులో రచయిత రాజసింహా దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించా.
 
 ***     ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే.. ఇంకా టైముందన్నారు. ఇప్పుడూ అలానే అంటారా?
 అవునండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడే పెళ్లెందుకండీ...
 
 ***     అంటే.. పెళ్లి చేసుకుంటే ఆనందం పోతుందా?
 అయ్యయ్యో.. అలా అనడంలేదు. ఆ లైఫ్ కూడా బాగుంటుందని కొన్ని జంటలను చూసి నప్పుడు అనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా.
 
 ***     మీ డ్రీమ్ రోల్స్?
 బోల్డన్ని ఉన్నాయి. అలాగే, డ్రీమ్ డెరైక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు.
 
 ***     నటుడిగా మీ లక్ష్యం ఏంటి?
 వెరైటీ సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. కెరీర్ ఆరంభించినప్పుడు రాత్రికి రాత్రి స్టార్‌ని అయిపోవాలనుకోలేదు. సినిమా సినిమాకీ నటుడిగా ఎదగాలనుకున్నాను. అలాగే, ఎదుగుతున్నాను.