ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలు కాదు కదా!

6 Oct, 2014 00:07 IST|Sakshi
ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలు కాదు కదా!

ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం ఉండటం పరిపాటైపోయింది. ఈ పాటలకు నర్తించే లలనామణులు చాలా హాట్‌గా కనిపిస్తుంటారు. దానికి తోడు సాహిత్యం కూడా ద్వంద్వార్థాలతో ఉంటుంది. ఈ విషయం గురించి ఇటీవల బాలీవుడ్‌లో ఓ చర్చ జరిగిందట. దీని గురించి కరీనాకపూర్ స్పందిస్తూ-‘‘హాలీవుడ్ సంగతి పక్కన పెడితే మన భారతీయ సినిమాల్లో పాటలుండాల్సిందే. లేకపోతే వెలితిగా ఉంటుంది. ఏడాదికి వంద సినిమాలు రూపొందితే వాటిలో రెండు, మూడు సినిమాలు పాటల్లేకుండా ఉంటాయేమో.
 
 మిగతా అన్నింట్లోనూ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మధ్య ప్రత్యేక పాటల కోసమే సినిమాలకు వస్తున్నారు. ఆ పాటల్లో ద్వంద్వార్థాలు ఉంటున్నాయి. తప్పేంటి? పాటల ద్వారా వినోదం పొందడం కోసమే వస్తున్నారు కానీ.. విజ్ఞానం సంపాదించాలని రావడంలేదు. విజ్ఞానమే కావాలనుకుంటే పాఠశాలకు వెళ్లాలి. వినోదం కోసం సినిమాలకు రావాలి. అయినా ఐటమ్ సాంగ్స్ అంటే భక్తి గీతాలు కాదు కదా’’ అని చెప్పారు. ప్రత్యేక పాటలనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదని, ఎప్పుడో నలభై ఏళ్ల నుంచే ఉన్నాయని, హెలెన్‌లాంటి తారలు ఈ పాటల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో చెప్పక్కర్లేదని కూడా కరీనా అన్నారు.