అభిమాని చెంప చెల్లుమనిపించిన హీరోయిన్

23 Dec, 2015 20:26 IST|Sakshi
అభిమాని చెంప చెల్లుమనిపించిన హీరోయిన్

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెల్లుమనిపించింది. ఈ సంఘటన ఈ మధ్య జరిగింది కాదు. అంజానా అంజానీ చిత్రం షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం చెప్పింది.

'ఓ అభిమాని నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతను నా అభిమాని అని మొదట తెలియలేదు. అంజానా అంజానీ షూటింగ్ సందర్భంగా నాతో ఫొటో దిగాలని వచ్చాడు. అతని కోరిక మేరకు ఫొటో దిగాను. అయితే ఆ తర్వాత అతను నాదగ్గరకు వస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో అతని కాలర్ పట్టుకుని చెంపపై లాగి కొట్టాను. ఆ తర్వాత భయంతో అతనికి దూరంగా పరిగెత్తాను' అని ప్రియాంక చెప్పింది.