గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు నేను లొకేషన్‌కి అందుకే వెళ్లలేదు

27 Dec, 2013 00:44 IST|Sakshi
గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు నేను లొకేషన్‌కి అందుకే వెళ్లలేదు
‘‘నా చిన్నతనంలోనే నేను పార్టీలకు దూరంగా ఉండేవాణ్ణి. ఇప్పుడూ అంతే. అంతే కానీ ‘పేజ్ త్రీ’లో కనిపించాలని, పార్టీలకు ఎటెండ్ అవ్వాలని నేనూ కోరుకోను, నమ్రతా కోరుకోదు’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌బాబు పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన ’1’ ‘నేనొక్కడినే’ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రను ఆయన తనయుడు గౌతమ్ చేశాడు. అయితే, గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు మహేష్ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదట.
 
ఈ విషయం గురించి, ఇతర విశేషాల గురించి సదరు ఇంటర్వ్యూలో మహేష్‌బాబు మాట్లాడుతూ -‘‘నాకు చిన్నప్పట్నుంచీ ఫ్యామిలీతో ఎటాచ్‌మెంట్ ఎక్కువ. మా అన్నయ్య రమేష్‌బాబు నాకు బాగా క్లోజ్. మా నాన్నగారు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు అన్నయ్య నా విషయంలో బాగా కేర్ తీసుకునేవాడు. ఇక, నాన్నగారు నాకు చాలా ప్రత్యేకం. నేను చేసే ప్రతి సినిమా గురించి ఫోన్ చేసి మరీ అడుగుతుంటారు. నేనో హిట్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతిసారీ నాన్నగారి వయసు 10, 15ఏళ్లు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆయన మొహంలో ఓ మెరుపు కనిపిస్తుంది’’ అని చెప్పారు.
 
గౌతమ్ యాక్ట్ చేయడం గురించి చెబుతూ -‘‘ ‘1’ షూటింగ్ మొదలైన మూడు నెలలకు గౌతమ్‌తో యాక్ట్ చేయిద్దామని సుకుమార్ అన్నారు. ఆ తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి సుకుమార్ రెండుమూడు రోజులు మా ఇంటికొచ్చి గౌతమ్‌తో ఆడుకున్నారు. అలా వాళ్లకి అలవాటై, షూటింగ్‌లో పాల్గొనడానికి గౌతమ్ ప్రిపేర్ అయ్యాడు. అలాగే, ఎంతోమంది నటీనటులకు గురువైన అరుణ బిక్షు మా గౌతమ్‌కి గురువు. ఆమె లొకేషన్లో ఉండి, మా వాడు బాగా యాక్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. 
 
గౌతమ్ యాక్ట్ చేసేటప్పుడు లొకేషన్లో నేనుంటే వాడి కాన్‌సన్‌ట్రేషన్ నా పైనే ఉంటుందనిపించింది. అందుకే నేను వెళ్లలేదు. వాడికి స్కూల్ సెలవులప్పుడే ఈ షూటింగ్ చేశారు. ఒకవేళ మున్ముందు కూడా తను యాక్ట్ చేయాలనుకుంటే హాలిడేస్‌లో అయితే మాకు ఓకే. ఎందుకంటే, చదువు ముఖ్యం కదా. కానీ, మేం మాత్రం యాక్ట్ చేయాలని తనను ఒత్తిడి చేయం’’ అని మహేష్‌బాబు చెప్పారు. ‘1’ చిత్రం గురించి మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. సుకుమార్ ఈ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. అలాగే కష్టమైన సినిమా అని కూడా తెలుసు. సినిమా ఆలస్యం అవుతోందని రకరకాల వార్తలు వచ్చాయి.
 
కానీ, ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఎక్కువ టైమ్ పడుతుందని ఊహించాం. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఇందులో నేను రాక్‌స్టార్‌గా చేశాను. యాక్షన్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. దెబ్బలు తగలకుండా యాక్షన్ సీక్వెన్స్ చేయాలనుకున్నాను. అందుకే ఫిట్‌నెస్ ట్రైనర్‌ని నియమించుకున్నాను. అథ్లెటిక్ లుక్‌లో కనిపించడం కోసమే ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని దాదాపు ఏడాదిన్నర కష్టపడి చేశాం. కొత్తరకం కాన్సెప్ట్ కాబట్టే ఇంత టైమ్ తీసుకుంది. ఇదో సవాల్‌లాంటి సినిమా. యూనిట్ మొత్తం చాలా హార్డ్‌వర్క్ చేశాం’’ అని తెలిపారు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా