కరణ్‌ నంబర్‌ ఇచ్చాడు కదా అని ఫోన్‌ చేస్తే..

17 Jun, 2020 18:16 IST|Sakshi

ఇప్పటికైనా కరణ్‌ నిజ స్వరూపం తెలిసిందా.. నెటిజన్ల ఫైర్‌!

‘‘నేను రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలో.. 2007లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో కరణ్‌ జోహార్‌ను ఇంటర్వ్యూ చేశాను. నటుడు కావాలనుకుంటున్నానని ఆయనతో చెప్పాను. మీ ఫోన్‌ నంబరు ఇవ్వమని అడిగాను. ఎట్టకేలకు ఆయన తన ఆఫీస్‌ ల్యాండ్‌లైన్‌ నంబర్‌ ఇచ్చారు. ఇక నన్ను ఎవరూ ఆపలేరు. నా దశ తిరిగింది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఆయుష్మాన్‌ ఖురానా పరిచయం. అబ్బో ఇలా ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంగా కరణ్‌ ఇచ్చిన నంబర్‌కు డయల్‌ చేశా! ఆ సమయంలో తను ఆఫీసులో లేడని చెప్పారు. ఆ మరుసటి రోజు మళ్లీ ఫోన్‌ చేశా. కరణ్‌ బిజీగా ఉన్నాడని చెప్పారు.(ముసుగులు తొలగించండి)

అలా ఫోన్‌ చేస్తూనే ఉన్నా. ఆఖరికి ఒకరోజు వాళ్లు కుండబద్దలు కొట్టేశారు. ‘‘మేం స్టార్లతో మాత్రమే పనిచేస్తాం. నీలాంటి వాళ్లతో పనిచేయలేం’’ అని కరుకుగా సమాధానం ఇచ్చారు’’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ ఆయుష్మాన్‌ ఖురానా 2015లో ప్రచురించిన ‘క్రాకింగ్‌ ది కోడ్‌: మై జర్నీ ఇన్‌ బాలీవుడ్‌’ బుక్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటుడు కావాలన్న కోరికను నెరవేర్చుకునే క్రమంలో తనకు ఎదురైన అనుభవాల గురించి భార్య తహీరా కశ్యప్‌తో కలిసి ఈ పుస్తకాన్ని రచించాడు. అవుడ్‌సైడర్‌ అయిన తాను బాలీవుడ్‌లో ప్రవేశించడానికి పడిన కష్టం గురించి ఇందులో వివరించాడు. కాగా యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో.. ఆయుష్మాన్‌ ఖురానా తన పుస్తకంలో రాసుకున్న విషయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. (సుశాంత్‌ మరణం; కరణ్‌కు మద్దతుగా వర్మ)

నెపోటిజం కారణంగా మానసిక ఒత్తిడిలో కూరుకుపోయిన సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని.. ఇందుకు బాలీవుడ్‌ పెద్దలే కారణమంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్‌ కిడ్స్‌ను తెరకు పరిచయం చేయడంలో ముందుండే కరణ్‌ జోహార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్‌ రాసిన పుస్తకంలోని పంక్తులను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఇప్పటికైనా కరణ్‌ నిజ స్వరూపం తెలిసిందా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రేడియో జాకీగా ఉన్నపుడు ఆయుష్మాన్‌ను పట్టించుకోని కరణ్‌‌.. అతడు హీరోగా ఎదిగిన తర్వాత మాత్రం తన షోకు పిలిచి ప్రతిభ ఉన్న నటుడు అంటూ పొగిడాడు అని కాఫీ విత్‌ కరణ్‌ షోను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఆర్జేగా కెరీర్‌గా ఆరంభించిన ఆయుష్మాన్‌.. విక్కీ డోనర్‌, అంధాధున్‌, సర్వమంగళ్‌ సావధాన్‌, ఆర్టికల్‌ 15 వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు