ఇలా జరుగుతుందని ముందే ఊహించా!

7 Jun, 2016 23:39 IST|Sakshi
ఇలా జరుగుతుందని ముందే ఊహించా!

‘‘హాలీవుడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఆ చిత్రాల కారణంగా మన చిత్రాల వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ మధ్య కొన్ని హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఫలితంగా మన చిత్రాల వసూళ్లు దెబ్బ తిన్నాయ్. ఇదే కొనసాగితే ‘మన సినిమా’ మనుగడ కష్టమవుతుంది’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. హాలీవుడ్ చిత్రాలు ఏ దేశంలో విడుదలైతే అక్కడి చిత్రాలకు నష్టం ఖాయం అని ఈ బిగ్ బి పేర్కొన్నారు.
 
  మన ఇండియా అనే కాదు.. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, జపాన్.. ఎక్కడైనా కానివ్వండి... హాలీవుడ్ చిత్రాలు గట్టి పోటీనిస్తున్నాయని ఆయన అన్నారు. ఇంకా అమితాబ్ మాట్లాడుతూ - ‘‘నాకెప్పట్నుంచో యూఎస్ వెళ్లడం అలవాటు. హాలిడేస్ అంటే అక్కడకు వెళ్లాల్సిందే. అలా వెళ్లిన ప్రతిసారీ వార్నర్ బ్రదర్స్, సోనీ, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ వంటి అక్కడి అగ్రనిర్మాణ సంస్థల అధినేతలు నన్ను కలవమని కోరేవారు. కానీ, నేను ఆసక్తి కనబర్చేవాణ్ణి కాదు.
 
  వాళ్లు ఆహ్వానించడం, నేను వెళ్లకపోవడం ఇలా జరుగుతుండేది. చివరకు ఓసారి వెళ్లాను. అప్పుడొక నిర్మాత మన ఇండియన్ సినిమాల నిర్మాణం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడి మార్కెట్ గురించి ఆయన చెప్పడం నన్నాశ్చర్యపరిచింది. 1995లో ఇది జరిగింది. భవిష్యత్తులో మన ఇండియన్ మార్కెట్‌ని హాలీవుడ్ చిత్రాలు శాసిస్తాయని అప్పుడే ఊహించా. మెల్లి మెల్లిగా అది జరుగుతోంది. ఈ పోటీని తట్టుకోవాలంటే మనం కూడా హాలీవుడ్ చిత్రాలకు దీటుగా సినిమాలు చేయాలి. అప్పుడే తట్టుకోగలుగుతాం’’ అన్నారు.