చిరు సరసన హీరోయిన్ ఎవరు?

6 Aug, 2014 14:43 IST|Sakshi
చిరు సరసన హీరోయిన్ ఎవరు?

టాలీవుడ్‌లో అతనే మెగాస్టార్‌. ఆయన సినిమా అంటే అభిమానులకు పండగ. ఆ అభిమాన ధనంతోనే రాజకీయాల్లో కొత్తదనం చూపించాలని ప్రయత్నించాడు. తెరపై దొరికిన సక్సెస్‌ రాజకీయాల్లో దొరకలేదు. ఓటు బ్యాంకు నిండలేదు. దాంతో మళ్లీ వెండితెర మీద మెరుపు చూపించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన చిరు 150 వ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల నుంచి ముఖానికి రంగు వేసుకోవడం మర్చిపోయిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు జిమ్ లోనే గడుపుతున్నారు.

ఇప్పుడు ఇంతకీ చిరంజీవి సరసన హీరోయిన్గా ఎవరు చేస్తారన్నది కూడా అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. గతంలో చిరంజీవి పక్కన హిట్ పెయిర్గా అనేక మంది హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. మాధవి, రాధ, రాధిక, జయప్రద, విజయశాంతి దగ్గర నుంచి.. సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన చివరి సినిమాలలో త్రిష, శ్రియ కూడా చిరు సరసన నటించారు. ఇక స్వీటీ అనుష్క కూడా ఓ సినిమాలో చిరంజీవితో పాటు ఒక పాటలో నర్తించింది.

ఇప్పుడు చిరంజీవి మళ్లీ హీరోగా తెరమీదకు వస్తే.. ఆయనతో హీరోయిన్గా నటించే అవకాశం ఎవరికి వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సోలో హీరోగా చేస్తారా.. లేక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తారా అనే చర్చ కూడా ప్రస్తుతం ఉంది. ఎందుకంటే, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం చివరి ఎపిసోడ్లో నాగార్జున అడిగినప్పుడు మల్టీస్టారర్ చేయడానికి తాను సిద్ధమేనంటూ చిరంజీవి చెప్పారు. ఈ విషయం ఆ ఎపిసోడ్ ప్రోమోలలో స్పష్టంగా ఉంది. దాంతో చిరంజీవి 150వ చిత్రం భారీ మల్టీ స్టారర్ అవుతుందా అని కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో అయితే సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష, నయనతార, శ్రియ.. ఇలా చాలామంది హీరోయిన్లు అగ్రశ్రేణి తారల జాబితాలో ఉన్నారు. వీళ్లలో కాజల్ అగర్వాల్ అయితే చిరంజీవి కుమారుడు రాంచరణ్ సరసన హీరోయిన్గా మగధీరలో నటించి పెద్ద హిట్ కూడా కొట్టేసింది. అయినంత మాత్రాన మళ్లీ చిరంజీవితో చేయకూడదని ఏమీ లేదు. ఇంతకుముందు అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో చిత్రాల్లో విజయవంతమైన హీరోయిన్గా నటించిన శ్రీదేవి.. నాగార్జునతో కూడా హీరోయిన్గా చేశారు. ఈ సంప్రదాయాన్ని రివర్స్లో కాజల్ చేస్తుందో లేక.. మరెవరైనా సీనియర్ హీరోయిన్ను చిరు సెలెక్ట్  చేసుకుంటారో చూడాలి.