ఆవేదన వ్యక్తం చేసిన ‘బిగ్‌ బీ’

15 Jun, 2020 16:59 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ​కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రంతికి గురి చేసింది. ఈ క్రమంలో ‘బిగ్‌ బీ’ అమితాబ్‌ బచ్చన్‌ సుశాంత్‌ మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎవరిని అడగకుండా.. ఎవరితో చెప్పకుండా నీ జీవితాన్ని అంతం చేసుకుంటావా.. నీ అద్భుతమైన ప్రతిభని.. నీ తెలివైన మనస్సును అంతం చేస్తావా.. విశ్రాంతిగా పడుకున్నావా’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాక సుశాంత్‌ ప్రతిభను, పని తీరును అమితాబ్‌ ఎంతో మెచ్చుకున్నారు. ‘సుశాంత్‌ నాల్గవ లైన్‌ గ్రూప్‌ డ్యాన్సర్‌గా జీవితాన్ని మొదలు పెట్టి.. నేడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి‌ సినీ ప్రయాణం ఎందరికో ఆదర్శం’ అ‍న్నారు.  ఈ క్రమంలో సుశాంత్‌తో జరిగిన ఓ సంభషణను గుర్తు చేసుకున్నారు అమితాబ్‌.
(సుశాంత్‌ చివరగా కాల్‌ చేసింది అతడికే)
 

‘అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ధోని కొట్టిన సిక్స్‌ ఐకానిక్‌ షాట్‌గా గుర్తింపు పొందింది. ధోని బయోపిక్‌లో సుశాంత్‌ ఆ సన్నివేశానికి వంద శాతం న్యాయం చేశాడు ఇది ఎలా సాధ్యమయ్యింది అని సుశాంత్‌ను అడిగాను. అందుకు అతడు ధోని సిక్స్ కొట్టిన ఆ వీడియోను వందసార్లు చూశానని చెప్పాడు. పని పట్ల అతని నిబద్దత అది. అయితే జీవితంలో  మనం చూపే ఈ ‘అతి’  కొన్ని అనర్థాలకు దారి తీస్తుంది’ అని అమితాబ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ విధమైన మసన్సు ఓ మనిషిని ఆత్మహత్యకు పురిగొల్పుతుందో ఎవరు చెప్పలేకపోయారు. అది ఓ రహస్యంగా మిగిలింది. ఎంతో లాభదాయకమైన జీవితాన్ని ఎవరిని అడగకుండానే ముగించావ్‌’ అంటూ అమితాబ్‌ సంతాపం వ్యక్తం చేశారు. డిప్రెషన్‌ అనేది మానసిక అనారోగ్యం అని.. దీని గురించి జనాలకు అవగాహన కల్పించండి అంటూ నెటిజనులు అమితాబ్‌ను కోరుతున్నారు. (డిప్రెష‌న్‌ను జ‌యించండిలా..)

మరిన్ని వార్తలు