ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే..

15 Aug, 2016 13:40 IST|Sakshi
ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే..

ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏమిటో.. దాని ఆవశ్యకత ఏమిటో తెలియజేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు దేవాకట్ట 'డైయింగ్ టు బి మీ ఒక షార్ట్ ఫిలింను విడుదల చేశాడు. ఇందులో ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముఖ్యపాత్ర పోషించారు. బాగా విద్యావంతురాలై ఉండి, ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉంచాలన్న భర్త ఆలోచనతో సతమతమయ్యే మహిళగా ఆమె కనిపించింది. తాను ఆర్థిక సంకెళ్ల మధ్య ఉన్నానంటూ బాధపడుతుంది. చివరకు, అతడి అభిప్రాయంతో విభేదించి తనను స్వేచ్ఛగా వదిలేయమని చెప్పి వెళ్తుంది.

'ఒక మహిళ తన జీవిత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినట్లు' అని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. 'స్వేచ్చగా జీవించండి.. స్వేచ్చగా జీవించనీయండి' అనే వాక్యంతో ఈ రెండు నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం ముగుస్తుంది. ఈ వీడియో ముగుస్తుండగా.. దేశ జనాభాలో మహిళలు 50శాతం ఉన్నారని.. వారిలో 70శాతం మహిళలు గృహిణిలుగా పనిచేస్తున్నారని, కేవలం పది శాతంమంది మహిళలు మాత్రం సంపాదిస్తున్నారని, అది దేశ సంపదలో ఒకశాతం మాత్రమే గణాంకాలు వెల్లడించాడు దర్శకుడు.