పాటల్లేని సినిమాకు మ్యూజిక్‌ చేయమన్నారు..!

10 Jul, 2018 12:34 IST|Sakshi

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్‌ ఎలకంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వైఫ్‌ ఆఫ్ రామ్‌’. వివేక్‌ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రఘు తొలిసారిగా తెలుగు సినిమాకు సంగీతమిస్తుండటంపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

  • పెళ్లిచూపులు సినిమా నచ్చటంతో తరుణ్ భాస్కర్‌ను అభినందిస్తూ మెసేజ్‌ చేశాను. అలా తరుణ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. తరుణ్ కామన్‌ ఫ్రెండ్‌ వల్ల వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది.
  • వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ సినిమాకు సంబంధించి తొలిసారిగా దర్శకుడు విజయ్‌ను కలిసినప్పుడు సినిమాలో పాటలు లేవు. కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రమే ఇస్తే చాలన్నారు. ఎక్కువగా మెలోడియస్‌, యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ చేసే నాకు ఈ సినిమాకు వర్క్‌ చేయటం చాలెంజింగ్‌గా అనిపించింది.
  • ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా నాలుగు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు కన్నడ, మలయాళ చిత్రాలకు పనిచేశాను. తెలుగులో గాయకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌, తమన్‌, హిప్‌ హాప్ తమిళ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఆరు పాటలు పాడాను.
  • భాషా పరంగా వర్కింగ్‌ స్టైల్‌లో మార్పేమి ఉండదు. కేవలం దర్శకుడి అభిరుచి మేరకే సంగీతమిస్తాం. విజయ్‌ నాతో చాలా డిఫరెంట్ మ్యూజిక్‌ చేయించారు. ఎక్కడా కమర్షియాలిటీ లేకుండా తక్కువ సౌండ్‌తో కొత్తగా ప్రయత్నించాం. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం.
  • ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ. సినిమాకు కథే మూలం. సంగీతానిది రెండో స్థానమే. కథ బాగుంటే అందుకు తగ్గ సంగీతం అదే వస్తుంది. నా వంతుగా సినిమాకు బెస్ట్ మ్యూజిక్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాను. తెలుగు నేటివిటీకి తగ్గ సంగీతాన్ని అందించేందుకు డైరెక్టర్‌ విజయ్ సహాయం చేశారు.
  • ఎప్పుడూ సంగీత దర్శకుడిని అవుతాననుకోలేదు. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. చాలాఏళ్లు భరతనాట్యం నేర్చుకున్నా.. తరువాత సైంటిస్ట్‌ గా వర్క్‌ చేశా.. కానీ టైం నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ను చేసింది. ప్రస్తుతం సంగీతం తప్ప మరో ఆలోచనే లేదు.
  • గాయకుడిగా కంటే కంపోజర్‌గానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను. ఇతర సంగీత దర్శకుల కోసం పాటలు పాడేప్పుడు పెద్దగా సలహాలేమి ఇవ్వను. కంపోజర్‌ ఆలోచనకు తగ్గట్టుగా పాడేందుకు ప్రయత్నిస్తా.
  • చాలా కాలంగా టాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా వైఫ్‌ ఆఫ్ రామ్‌ టాలీవుడ్‌లో నా తొలి చిత్రం. అందరికి నచ్చుతుందరని ఆశిస్తున్నాను.
మరిన్ని వార్తలు