ఆ మంచితనం వందేళ్లు ఉంటుంది

9 Jun, 2018 00:33 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌సింగ్, విజయ్‌ యేలెకంటి, మంచు లక్ష్మీ, మోహన్‌బాబు, శిల్పారెడ్డి

మోహన్‌బాబు

‘‘బిడ్డను పొగడొద్దని శాస్త్రం చెబుతోంది. అయితే నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా. ట్రైలర్‌ చూశాను. అద్భుతంగా ఉంది. జయాపజయాలు పక్కన పెడితే మోహన్‌బాబు ఫ్యామిలీ ఎప్పుడూ ఎవర్నీ మోసం చేయదు. ఆ మంచితనం వందేళ్లు ఉంటుంది’’ అన్నారు మోహన్‌బాబు.  మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో విజయ్‌ యేలెకంటి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్‌ ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. మంచు ఎంటర్‌టైన్మెంట్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

సామ్రాట్, శ్రీకాంత్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘నిర్మాతలు బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాలి. ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి. అనవసర ఖర్చు తగ్గించాలి. అప్పుడే మంచి నిర్మాతగా ఎదుగుతాం. నాకు దర్శకుడంటే చాలా గౌరవం. అతను లేకపోతే సినిమా లేదు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. లక్ష్మీ మంచు మాట్లాడుతూ– ‘‘మా నాన్నే నాకు పెద్ద గిఫ్ట్‌.

ఏ దశలోనూ ఆర్టిస్ట్‌ కావాలని అనుకోని నేను ఈ స్టేజ్‌ మీద నటిగా ఉన్నందుకు కారణం మా నాన్నే. నీ కూతురిగా ఎప్పుడూ గర్వపడతా. క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం. నిర్మాతలు నన్ను పూర్తిగా నమ్మడంతో నా బాధ్యత మరింత పెరిగింది. నా ఫ్యామిలీయే నా బ్యాక్‌బోన్‌. మోహన్‌బాబు కూతురిగా కాకుండా నా సొంత ప్రతిభతో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ప్రతిక్షణం థ్రిల్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకుడికి ఇది ఫస్ట్‌ సినిమాలా  లేదు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ లక్ష్మీతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

‘‘మేం ఎప్పుడైనా బాగా వర్క్‌ చేశాం అనుకున్నప్పుడు లక్ష్మీ షోస్, వెబ్‌ సిరీస్‌లు గుర్తుకు వస్తే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మోహన్‌బాబు అంకుల్‌కి మరోసారి థ్యాంక్స్‌. లక్ష్మీ వెరీ హార్డ్‌ వర్కర్‌. తన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు స్వప్నా దత్‌. ‘‘మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో భాగం అవ్వడం వల్ల షూటింగ్‌కి వెళ్లే అవసరం లేకపోయింది. సినిమా హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల.  దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ – ‘‘లక్ష్మీ గారిని రెండు మూడుసార్లే కలిసినా నన్నో ఫ్రెండ్‌లా నమ్మి అన్ని విషయాల్లో హెల్ప్‌ చేశారు. టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సామ్రాట్, శిల్పా రెడ్డి, శ్రీకాంత్, ప్రియదర్శి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు