కోనసీమ నేపథ్యంతో కుటుంబ కథాచిత్రం: సుకుమార్

1 Feb, 2016 09:39 IST|Sakshi
కోనసీమ నేపథ్యంతో కుటుంబ కథాచిత్రం: సుకుమార్

త్వరలో కోనసీమ నేపథ్యంలో ఓ కుటుంబ కథాచిత్రాన్ని నిర్మిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత.. తన కుటుంబసభ్యులతో కలిసి అమలాపురం సావరంలోని తన ఆప్తమిత్రుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్ అన్యం రాంబాబు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తనను విలేకరులతో మాట్లాడారు. తాను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కోనసీమ ప్రాంతానికి చెందినవారమేనని చెబుతూ, కోనసీమ నేపథ్యంలో చిత్రాన్ని తమ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిస్తామని చెప్పారు.

రాంబాబు, తాను చిన్నతనం నుంచి స్నేహితులమని, 1993-97 మధ్య కాకినాడ ఆదిత్య కళాశాలలో అధ్యాపకులుగా పని చేశామని చెప్పారు. కోనసీమకు వస్తే రాంబాబును కలవకుండా వెళ్లలేనని చెప్పారు. భార్య హంసిని, కుమారుడు నాయుడు, కుమార్తె సుకృతిలతో కలిసి రాంబాబు కుటుంబసభ్యులతో కొంతసేపు సరదాగా గడిపిన సుకుమార్ అనంతరం అమలాపురం సమీపంలోని ఈదరపల్లిలోని సోదరి ఇంటికి వెళ్లారు.