చిత్ర దర్శకుడు మోసం చేశాడంటూ ఫిర్యాదు..

12 Oct, 2017 08:51 IST|Sakshi

పెళ్లి చేసుకుని మోసం చేశాడన్న బాధితురాలు

న్యాయం చేయాలని డిమాండ్‌

కౌన్సెలింగ్‌కు పిలిపిస్తామన్న పోలీసులు

సాక్షి, పెదవాల్తేరు (విశాఖపట్నం): లవ్‌ చేయాలా వద్దా చిత్ర దర్శకుడు నిజ జీవితంలో ప్రేమించి పెళ్ళిచేసుకుని తరువాత మొహం చాటేశాడు. తనను చిత్ర దర్శకుడు మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ బుధవారం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. వివరాలివి.. మురళీనగర్‌కు చెందిన సినీ దర్శకుడు సయ్యద్‌ నౌషద్‌ చినవాల్తేరుకు చెందిన లావణ్యతో పరిచయం ఏర్పడింది.

మతాలు వేరైనప్పటికీ 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడునెలల కాపురం అనంతరం తానో ప్రాజెక్ట్‌ విషయమై బయటకు వెళ్తున్నానంటూ చెప్పి తిరిగి రాలేదు. ఇంతలో నౌషద్‌కు చిత్ర దర్శకుడిగా అవకాశం వచ్చింది. 10నెలలు పాటు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. భార్యను పట్టించుకోలేదు. స్నేహితుల సహాయంతో నౌషద్‌ చిరునామా తెలుసుకుని ఆయన్ను లావణ్య విశాఖ రప్పించింది. రూ.3లక్షల వ్యయంతో‘ కాఫీషాప్‌ పెట్టించింది. ఇదే దుకాణంలో మరో యువతితో నౌషద్‌ పరిచయం పెంచుకున్నాడు.

లావణ్యను పట్టించుకోకుండా ఆ అమ్మాయితోనే సన్నిహితంగా మెలిగేవాడు. తనకు అర్జెంట్‌గా రూ.10లక్షలు కావాలని నౌషద్‌ అడిగాడు. ఇవ్వలేనని లావణ్య చెప్పింది. కొత్తగా పరిచయం అయిన యువతి విషయమై నిలదీసింది. సమాధానం లేకపోవడంతో పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే నౌషద్‌ను పిలిపించి మందలించామని, అయినా లావణ్య ఒప్పుకోకపోవడంతో కౌన్సెలింగ్‌ నిమిత్తం కేసును మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదలాయిస్తున్నామని సీఐ వెంకటరావు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు