#మీటూ: ప్రముఖ రచయిత పాడుపని

9 Oct, 2018 09:21 IST|Sakshi
ప్రముఖ రచయిత వైరముత్తు

విదేశాల్లో ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద మనుషుల ముసుగులో సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ మీటూ ఉద్యమం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా వ్యాపించింది. దక్షిణాదిలో గాయని చిన్మయి ఈ మీటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ వేధింపుల ఆరోపణల కోవలోకి మరో బాధితురాలు చేరారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత వైరముత్తు రామసామి తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.

ఆయనతో తనకు ఎదురైన భయంకరమైన అనుభావాలను గురించి జర్నలిస్ట్‌ సంధ్యా మీనన్‌తో చెప్పారు. ఆమె చెప్పిన విషయాలను సంధ్యా మీనన్‌ తన ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు రాసిన వైరముత్తు అనేక సార్లు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వైరముత్తు తన దగ్గర పనిచేసిన ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం గురించి బాధితురాలు చెబుతూ. ‘నా 18 ఏట నుంచే నేను వైరముత్తు దగ్గర పనిచేయడం ప్రారంభించాను. పరిశ్రమ ఆయన్నోక లెజండ్‌గా చూసేది. నేను కూడా ఆయనను చాలా గౌరవించాను. కానీ ఆయన అసలు స్వరూపం తెలిశాక నేను చాలా భయపడి పోయాను. సమాజంలో ఇంతలా గౌరవించబడే వ్యక్తి నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిరిక్స్‌ ఎక్స్‌ప్లేన్‌ చేసే నెపంతో నన్ను తన దగ్గరికి పిలిపించుకుని కౌగిలించుకునేవాడు.. ముద్దు పెట్టుకునేవాడు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. భయంతో వణికిపోయాను. కేవలం ఓకే సార్‌ అని మాత్రం చెప్పి అక్కడ నుంచి బయటపడ్డాను. అప్పటి నుంచి ఒంటరిగా ఉండాలంటే భయమేసేది. ఎప్పడు నలుగురితో కలిసి ఉండేందుకు ప్రయత్నించేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక ‘వైరముత్తు గురించి పరిశ్రమలో అందరికి తెలుసు. ఇండస్ట్రీలో అతనో ప్రిడేటర్‌లాంటి వాడు. కానీ అతనికి వ్యతిరేకంగా ఎవరూ ఏం మాట్లడలేరు. ఎందుకంటే అతనికి ఉన్న రాజకీయ సంబంధాలు అలాంటివి. బాధితుల మౌనాన్ని ఆసరాగా తీసుకుని ఆయన మరింత రెచ్చిపోయేవాడు’ అంటూ అసలు నైజాన్ని వెల్లడించారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై గాయని చిన్మయి, దర్శకుడు సీఎస్‌ అముధాన్‌ స్పందించారు. ఈ విషయం గురించి చిన్మయి స్పందిస్తూ ‘ఆయన గురించి పరిశ్రమకు తెలుసు.. మగవారికి తెలుసు.. కానీ ఏం చేయలేరు’ అంటూ ట్వీట్‌ చేయగా అముధాన్‌ ‘మీరు చాలా ధైర్యంగా ప్రవర్తించారు’ అంటూ అభినందించారు.

మరిన్ని వార్తలు